తాకట్టు పెట్టిన బంగారాన్ని అమ్మేశారు
గిద్దలూరు రూరల్: తాము తాకట్టుపెట్టిన బంగారాన్ని అమ్మేశారని, తిరిగి తూకం తక్కువ బంగారాన్ని ఇస్తామంటున్నారని గిద్దలూరు పట్టణంలోని కుమ్మరాంకట్టసెంటర్ వద్ద ఉన్న మణప్పురం గోల్డ్‌లోన్ కార్యాలయం ఎదుట శుక్రవారం బాధిత కుటుంబం నిరసన వ్యక్తం చేసింది. గుండ్రెడ్డిపల్లె గ్రామానికి చెందిన దూదేకుల హజరత్, రమీజాబీ దంపతులు వారి కుమారుడితో సహా నిరసనకు దిగారు. గోల్డ్ లోన్ కార్యాలయం తెరవనివ్వకుండా మెట్లపై బైఠాయించి అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. 2024 మార్చి 12వ తేదీ హజరత్ కుటుంబానికి డబ్బులు అవసరమై 37 గ్రాముల కేడీఎం బంగారంతో తయారు చేసిన నల్లపూసల దండను రూ.82 వేలకు తన పేరు మీద హజరత్ తాకట్టు పెట్టాడు. కాగా మణప్పురం గోల్డ్‌లోన్ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది ఒకరు ఆ బంగారాన్ని అతని బంధువు దమ్ము గోపాల్ పేరు మీదకు మార్చుకుని సెప్టెంబర్ 2026లో విక్రయించాడు. తాకట్టు పెట్టిన తన బంగారం వస్తువును తనకు ఇప్పించాలని నాలుగు రోజుల క్రితం మణప్పురం గోల్డ్ లోన్ కార్యాలయం వద్దకు హజరత్ వెళ్లగా అసలు విషయం వెలుగుచూసింది. దీనిపై మణప్పురం గోల్డ్ సిబ్బందిని నిలదీయగా.. విషయం బయటపడితే కంపెనీ పరువుపోతుందని భావించిన సిబ్బంది.. హజరత్ బంగారంకు బదులుగా అదే తూకంలో బంగారం ఇస్తామంటూ నచ్చజెప్పారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో హజరత్ అందుకు అంగీకరించాడు. కానీ, మణప్పురం గోల్డ్ లోన్ వారు హజరత్‌కు కేడీఎం బంగారం కాకుండా తక్కువ రకం బంగారాన్ని ఇవ్వడంతో ఆగ్రహం చెంది తమకు న్యాయం చేయాలని కోరుతూ గురువారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పట్టించుకోకపోగా, మీరు బయట చూసుకోండి.. కోర్టుకు వెళ్లండంటూ సీఐ సురేష్ తమపై ఆగ్రహం వ్యక్తం చేశారని, నన్ను అడిగి తాకట్టు పెట్టారా అంటూ ప్రశ్నించారని బాధితులు వాపోయారు. తన భార్య రమీజాబీ ముందే సీఐ బూతుల పురాణం మొదలుపెట్టాడంటూ హజరత్ వాపోయాడు. అన్యాయం జరిగింది.. న్యాయం చేయడంటూ పోలీసు స్టేషన్‌కు వెళ్తే అగౌరవంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధంగా అయితే తమకు న్యాయం జరగదని భావించి శుక్రవారం గోల్డ్ లోన్ కార్యాలయం ఎదుట తన కుటుంబ సభ్యులతో కలిసి కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని హజరత్ కుటుంబ సభ్యులతో చర్చించారు. బాధితులతో ఏఎస్సై జిలాని మాట్లాడారు. వారితో పాటు గోల్డ్ లోన్ సిబ్బందిని పోలీసు స్టేషన్‌కు పిలిపించి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో బాధితులు నిరసన విరమించి వెనుదిరిగారు.
గిద్దలూరులో మణప్పురం కార్యాలయం వద్ద
బాధిత కుటుంబం నిరసన
సీఐ పట్టించుకోకపోగా తమనే బూతులు తిట్టారంటూ ఆవేదన


