30 శాతం ఐఆర్ ప్రకటించాలి
మార్కాపురం టౌన్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 30 శాతం మధ్యంతర భృతిని జూన్ 2024 నుంచి ప్రకటించాలని, 12వ పీఆర్సీ కమిషన్‌ను నియమించాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎస్‌కే నాయబ్ రసూల్ డిమాండ్ చేశారు. శుక్రవారం మార్కాపురం తాలూకా కార్యాలయం వద్ద ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు. ప్రతి ఆరు నెలలకు మంజూరు చేయాల్సిన కరువు భత్యం, అలాగే ఉద్యోగ విరమణ అనంతర నిధులు, ఇతర బకాయిలను అందించడం లేదన్నారు. 11వ పీఆర్సీ బకాయిలు ఇంత వరకు చెల్లించలేదని, 12వ పీఆర్సీ కమిషన్ చైర్మన్ 20 నెలల క్రితం రాజీనామా చేసినా ప్రభుత్వం పట్టీపట్టనట్టు వ్యవహరించడం సరికాదన్నారు. పాఠశాల వ్యవస్థలో 117 జీవోను రద్దుచేసినట్లుగా ప్రభుత్వం చెబుతున్నా, అవే అంశాలను జీవో 19, 20 రూపంలో తీసుకొచ్చి 1 నుంచి 10వ తరగతి వరకు ఒకే పాఠశాలలో విద్యను కొనసాగిస్తున్నారని ఆరోపించారు. వివిధ యాప్‌లు, పోస్టింగులతో ఉపాధ్యాయులకు పనిభారం ఎక్కువైందని, 100 రోజుల పాటు పరీక్షల షెడ్యూల్ ఇస్తే 120 రోజుల్లో సిలబస్ ఎలా పూర్తిచేయాలని ప్రశ్నించారు. కార్యక్రమానికి జిల్లా కార్యదర్శి జె.ఆనందరావు అధ్యక్షత వహించగా, జోన్ సీనియర్ నాయకులు పి.పాండు, జిల్లా కార్యదర్శి మల్లికార్జున, రాష్ట్ర కౌన్సిలర్ నారాయణరెడ్డి, రాష్ట్ర పూర్వపు కార్యదర్శి రఘుబాబు, భాస్కర్ నాయుడు, రంగస్వామి, ప్రసాదరావు, బాలూనాయక్, శ్రీనివాసరావు, అంకిరెడ్డి, చక్రధారి తదితర 60 మందికి పైగా ఉపాధ్యాయులు ధర్నాలో పాల్గొన్నారు.
12వ పీఆర్సీ కమిషన్ నియమించాలి ఏపీటీఎఫ్ డిమాండ్


