జాతీయ రహదారిపై కారు దగ్ధం
సీఎస్‌పురం(పామూరు): జాతీయ రహదారిపై కారు దగ్ధమైన సంఘటన సీఎస్‌పురం మండలంలోని కంభంపాడు–ర్‌కేపల్లి అడ్డ రోడ్డు మధ్య శుక్రవారం చోటుచేసుకుంది. అందిన సమాచారం మేరకు.. సీఎస్‌పురం మండలంలోని రెడ్డిగారిపల్లె గ్రామానికి చెందిన నారా నారాయణ పామూరులోని తన మిత్రుని వద్ద ఉదయం కారు తీసుకుని ఆరేపల్లికి వెళ్లాడు. అనంతరం గ్రామానికి చెందిన మరో వ్యక్తితో కలిసి మిట్టపాలెం నారాయణస్వామి ఆలయానికి కారులో వెళ్లి తిరిగి ఆర్‌కేపల్లి వెళ్తున్నారు. ఈ క్రమంలో కంభంపాడు, ఆర్‌కేపల్లి అడ్డ రోడ్డు మధ్యలో కారుకు గొర్రెల మంద అడ్డుగా రాగా నిలిపారు. ఇంతలో కారు నుంచి మంటలు రావడాన్ని గొర్రెల కాపరులు గమనించి కార్‌లో వ్యక్తులను అప్రమత్తం చేశారు. కారు రోడ్డు పక్కన నిలిపి మంటలు ఆర్పేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. క్షణాల వ్యవధిలో కారు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదానికి పెట్రోల్ లీకేజీనే కారణమని భావిస్తున్నారు.
అడ్డుగా వచ్చిన గొర్రెల మందతో
తృటిలో తప్పిన ప్రమాదం


