ట్రబుల్‌ ఐటీ | - | Sakshi
Sakshi News home page

ట్రబుల్‌ ఐటీ

Feb 28 2026 7:09 AM | Updated on Feb 28 2026 7:09 AM

ట్రబుల్‌ ఐటీ

ట్రబుల్‌ ఐటీ

కనిగిరిలో ట్రిపుల్‌ ఐటీ ఏర్పాటు కలేనా.. బడ్జెట్‌లో లేని కేటాయింపులు సీఎం జిల్లా పర్యటనలోనూ ఊసు లేదు ఆర్భాటపు ప్రకటనలకే కూటమి నేతలు పరిమితం

డీలాపడిన రియల్‌ ఎస్టేట్‌

రాష్ట్ర ప్రభుత్వ తీరుతో కనిగిరిలో ట్రిపుల్‌ ఐటీ ఏర్పాటు కలగానే మిగిలిపోతోంది. అధికార పార్టీ నేతల ఆర్భాటపు ప్రకటనలు ఉత్త గాలి మాటలుగానే ఉండిపోతున్నాయి. ఇటీవల ఒంగోలు ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌ విద్యార్థులు అక్కడే ఉండాలని నిరసనలు తెలపడం.. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌లో ట్రిపుల్‌ ఐటీ సొంత భవనాలకు ప్రత్యేక నిధులు కేటాయించకపోవడం.. వైపాలెం నియోజకవర్గ పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబు కనిగిరి ట్రిపుల్‌ ఐటీ కళాశాల నిర్మాణం ఊసే ఎత్తకపోవడంతో ప్రజల అనుమానాలకు, ప్రశ్నలకు మరింత ఊతమిచ్చాయి.

బల్లిపల్లి వద్ద ట్రిపుల్‌ ఐటీ నిర్మించే ప్రాంతం ఇదే

కనిగిరిరూరల్‌:

జిల్లాలో వెనుకబడిన ప్రాంతమైన కనిగిరిలో ట్రిపుల్‌ ఐటీ కాలేజీని ఏర్పాటు చేస్తే ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుంది. అయితే కాలేజీ ఏర్పాటు, సొంత భవనాల నిర్మాణానికి సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం నుంచి ఎటువంటి ముందడుగు పండటం లేదు. గతంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 2018 ఆగస్టులో అప్పటి సీఎంగా చంద్రబాబు.. మంత్రులు ఎంతో ఆర్భాటంగా నియోజకవర్గంలోని పామూరు మండలం దూబగుంట వద్ద ట్రిపుల్‌ ఐటీ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సుమారు రూ.1,200 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఒక్క రూపాయి నిధులు మంజూరు కాలేదు. పనులు జరగలేదు. ఆ తర్వాత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ప్రజామోదం మేరకు కనిగిరి–పామూరు ప్రధాన రహదారి (ఎన్‌హెచ్‌565) పక్కన కనిగిరి నియోజకవర్గ కేంద్రానికి 15 కి.మీల దూరంలో బల్లిపల్లి వద్దకు ట్రిపుల్‌ ఐటీ కళాశాలను బదలాయించారు. బల్లిపల్లి రెవెన్యూలోని సర్వే నంబర్‌ 766, 766–1లో సుమారు 255 ఎకరాలు భూ కేటాయింపు చేశారు. భూ సంబంధిత సర్వేలు, రికార్డుల ప్రక్రియ జరిగింది. ఆ తర్వాత తిరిగి అధికారంలో వచ్చిన టీడీపీ ప్రభుత్వంలో ట్రిపుల్‌ ఐటీ కళాశాల నిర్మాణమే తమ లక్ష్యం అని ఆ పార్టీ నేతలు ప్రచారం హోరెత్తించారు. స్థల శుభ్రత, చదునుకు కొంత నిధులు కేటాయించారంటూ.. పనుల ప్రక్రియ జరుగుతుందంటూ ఊదరగొట్టారు. విద్యా శాఖ ఉన్నతాధికారులు సైతం ట్రిపుల్‌ ఐటీ స్థలం వద్దకు పరిశీలనలు చేస్తున్నట్లు హడావుడి చేశారు. విద్యాశాఖ మంత్రి లోకేష్‌ పీసీపల్లి పర్యటనకు వచ్చినప్పుడు కనిగిరిలోనే ట్రిపుల్‌ ఐటీ కాలేజీ నిర్మిస్తామని, సీఎం చేతుల మీదుగానే శంకుస్థాపన జరుగుతుందని వెల్లడించారు. కానీ నిధుల కేటాయింపు ప్రక్రియ ముందుకు సాగకపోవడంపై విద్యార్థి, వివిధ సంఘాల నాయకుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికితోడు ఇటీవల ఒంగోలు ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌ విద్యార్థులు కాలేజీని అక్కడే ఉండాలని, కనిగిరి ప్రాంతానికి తరలించవద్దంటూ నిరసనలు తెలిపారు. ఈ నేపథ్యంలో అసలు ఇక్కడ ట్రిపుల్‌ ఐటీ కాలేజీ ఏర్పాటవుతుందా లేదా అన్న సందిగ్ధం నెలకొంది.

బల్లిపల్లి జంక్షన్‌లో ట్రిపుల్‌ ఐటీ నిర్మిస్తే ఈ ప్రాంత విద్యార్థులకు విద్యా సౌకర్యంతో పాటు వెనుకబడిన కనిగిరి ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది. రెవెన్యూ డివిజన్‌, నియోజకవర్గ కేంద్రమైన కనిగిరికి 15 కి.మీల దూరంలోనే ట్రిపుల్‌ ఐటీ కాలేజీ ఉంటుంది. బల్లిపల్లి రెవెన్యూ పరిధిలోనే నడికుడి– శ్రీకాళహస్తి రైల్వే లైన్‌ పాయింట్‌ ఉంది. ట్రిపుల్‌ ఐటీకి దగ్గరలోనే.. కనిగిరికి సమీపంలో ఎన్‌ఎహెచ్‌ 565 ప్రధాన రహదారి లైన్‌తో పాటు, గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే రోడ్డు, రింగ్‌ రోడ్డు నిర్మిస్తున్నారు. బల్లిపల్లిలో కళాశాల వల్ల మార్కాపురం జిల్లాతో పాటు, నెల్లూరు, కడప ప్రాంతాల విద్యార్థులకు దగ్గరగా ఉంటుంది. అయితే దీన్ని ఆసరాగా చూపించి.. కనిగిరిలో అధికార పార్టీ నేతలు జోరుగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం సాగించారు. నిన్నటి వరకు ఎకరా రిజిస్టర్‌ భూమి రూ.15 నుంచి రూ.20 లక్షలు ఉన్న దాన్ని ఏకంగా రూ.50 నుంచి రూ.60 లక్షలకు పెంచారు. మరీ విచిత్రం ఏమిటంటే ఓ రియల్‌ వ్యాపార సంస్థకు చెందిన ప్రైవేటు కంపెనీ వారు బాలవెంకటేశ్వర పురంలోని కొండ శివారు ప్రాంతానికి ఆనుకుని ఉన్న సుమారు 120 ఎకరాల భూమిని ఎకరా పది లక్షలకు పెట్టి కొనుగోలు చేశారంటే ఇక్కడ వ్యాపారం ఎంతలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇటీవల జరిగిన బడ్జెట్‌ సమావేశాలు, చంద్రబాబు మార్కాపురం పర్యటన తర్వాత ఒక్క సారిగా రియల్‌ ఎస్టేట్‌ లావాదేవీలు డీలాపడ్డాయి.

Advertisement
 
Advertisement
Advertisement