అసత్య ప్రచారాలతో మభ్యపెట్టొద్దు | - | Sakshi
Sakshi News home page

అసత్య ప్రచారాలతో మభ్యపెట్టొద్దు

Feb 28 2026 7:09 AM | Updated on Feb 28 2026 7:09 AM

అసత్య ప్రచారాలతో మభ్యపెట్టొద్దు

అసత్య ప్రచారాలతో మభ్యపెట్టొద్దు

అసత్య ప్రచారాలతో మభ్యపెట్టొద్దు

వైఎస్సార్‌, జగన్‌ హయాంలోనే వెలిగొండ ప్రాజెక్టు పనులు ముందుకు.. 13 ఏళ్లు సీఎంగా ఉండి బాబు ఖర్చు పెట్టింది రూ.1100 కోట్లు రెండేళ్లు కరోనా పోగా మూడేళ్లలో జగన్‌ ఖర్చు చేసింది రూ.1050 కోట్లు వైఎస్సార్‌ ఖర్చు చేసింది రూ.5455 కోట్లు మాజీ ఎమ్మెల్యే, మార్కాపురం వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జి అన్నా రాంబాబు

మార్కాపురం టౌన్‌: ‘‘1996లో వెలిగొండ ప్రాజెక్టుకు శిలాఫలకం వేసింది నేనే అని 2026 జూలై నాటికి పూర్తిచేసి జాతికి అంకితం చేస్తానని’’ ఈనెల 25న మార్కాపురంలో నిర్వహించిన బహిరంగ సభలో చెప్పుకోవడం 13 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబుకే చెల్లిందని మాజీ ఎమ్మెల్యే మార్కాపురం వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జి అన్నా రాంబాబు అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి జరిగినా, ఏ ముఖ్యమంత్రి కాలంలో అభివృద్ధి చేసినా ఆ క్రెడిట్‌నంతా తమ ఖాతాలో వేసుకోవడం చంద్రబాబు నైజమన్నారు. శుక్రవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో చంద్రబాబు బహిరంగ సభలో చెప్పిన అసత్యాలపై ఆయన మాట్లాడారు. వెలిగొండ ప్రాజెక్టుకు 1996లో చంద్రబాబు శిలాఫలకం వేశారని, ఆ తరువాత 8 ఏళ్లు ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉండి ప్రాజెక్టుకు ఎంతమేర పనులు చేశారో.. ఎంత నిధులు కేటాయించారో ప్రజలకు వివరించలేదని అన్నారు. ప్రాజెక్టు భూ సేకరణకుగానీ, బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు కానీ చేయకుండా 2026 జూలై నాటికి పూర్తిచేసి జాతికి అంకితం చేస్తానని చెప్పడం హాస్యాప్పదంగా ఉందన్నారు. 2005లో ముఖ్యమంత్రిగా ఉన్న డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి వెలిగొండ ప్రాజెక్టుకు ఫేజ్‌–1 కింద రూ.5455 కోట్లు ఖర్చు చేశారని, సీఎంగా ఉన్నంత కాలం చంద్రబాబు హయాంలో ఖర్చు చేసింది రూ.1100 కోట్లు మాత్రమేనన్నారు. ఇంకా ప్రాజెక్టు కోసం సుమారు రూ.3500 కోట్లు అవసరమైతే ఈ ఏడాది బడ్జెట్‌లో కేవలం రూ.496 కోట్లు కేటాయించి జూలై నాటికి వెలిగొండకు నీళ్లిచ్చి జాతికి అంకితం చేస్తానని చెప్పుకోవడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. వైఎస్‌ జగన్‌ హయాంలో రెండేళ్లు కరోనా పోగా మిగిలిన మూడేళ్లలో రూ.1050 కోట్లు ఖర్చు చేశారన్నారు. గత ప్రభుత్వంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి టన్నెల్‌ పూర్తయిన సందర్భంగా జాతికి అంకితం చేశారేకానీ ప్రాజెక్టు మొత్తం జాతికి అంకితం చేయలేదని చెప్పిన సంగతి మీకు తెలీదా అన్నారు. ఇప్పటికై నా ప్రాజెక్టు పనులపై మాయమాటలు, అబద్ధాలు ప్రజలకు చెప్పవద్దని హితవు పలికారు.

ప్రజలకు తాగు, సాగు నీరు అందించాలి

తాను గిద్దలూరు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పాపినేనిపల్లి, వెలగలపాయ గ్రామాల పరిధిలో ఉన్న ప్రజలకు తాగు, సాగునీరు అందించేందుకు డ్రిప్‌ ఇరిగేషన్‌ను మంజూరు చేయించుకున్నామని, కానీ టెండర్లు రద్దుకావడంతోనే పనులు ప్రారంభానికి నోచుకోలేదన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి డ్రిప్‌ ఇరిగేషన్‌పై దృష్టిసారించి ముఖ్యమంత్రి నుంచి నిధులు మంజూరు చేయించుకుని ఆ ప్రాంత ప్రజలకు తాగు, సాగు నీరు అందించాలని కోరారు. జగన్‌ హయాంలో జరిగిన భూముల రీసర్వేపై ప్రజల్లో అపోహలు సృష్టించి రాజకీయ లబ్ది పొందింది కూటమి నాయకులు కాదా అని ప్రశ్నించారు. పార్లమెంటు స్థానాలను యూనిట్‌గా తీసుకొని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ నూతన జిల్లాలను ఏర్పాటు చేశారని, అందువలనే మార్కాపురం జిల్లాను ప్రకటించలేకపోయారన్నారు. దూరాన్ని ప్రాతిపదికన తీసుకొని ఒంగోలు నుంచి మార్కాపురం జిల్లాను ప్రకటించిన నీవు దొనకొండను కూతవేటు దూరంలో ఉన్న మార్కాపురంలో కలపకుండా ఒంగోలులో కలపడం ఏమిటని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసం తిరుమల లడ్డూ విషయంలో రోజుకో మాట మాట్లాడటం మంచి పద్ధతి కాదన్నారు. సూపర్‌ 6.. సూపర్‌ హిట్‌ అయిందని కూటమి నాయకులు పండుగ చేసుకుంటున్నారని, ఆడబిడ్డ నిధికింద నెలకు రూ.1500, రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, అన్నదాత సుఖీభవ కింద రెండేళ్లలో సంవత్సరానికి రూ.20 వేలు ఇస్తానన్న నీవు ఎంత నగదు ఇచ్చావో ప్రజలకు తెలపలేదన్నారు. ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు అవుతున్నా మెడికల్‌ కాలేజీ విషయం పట్టించుకోకపోవడం ఈ ప్రాంత పేద మధ్య తరగతి ప్రజల ఆరోగ్యంపై మీకున్న చిత్తశుద్ధి అర్ధమవుతుందన్నారు. సమావేశంలో వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి షంషేర్‌ ఆలీబేగ్‌, జెడ్పీటీసీలు నారు బాపన్‌రెడ్డి, ఏడుకొండలు, మున్సిపల్‌ చైర్మన్‌ చిర్లంచర్ల బాలమురళీకృష్ణ, పార్టీ పట్టణ అధ్యక్షుడు సలీమ్‌, మాజీ ఏఎంసీ చైర్మన్‌ గొలమారి శ్రీనివాసరెడ్డి, మార్కాపురం, తర్లుపాడు మండల అధ్యక్షుడు పోరెడ్డి చెంచిరెడ్డి, మురారి వెంకటేశ్వర్లు, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ 2 అంజమ్మ శ్రీనివాసులు, ముత్తారెడ్డి వెంకటరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మోరా శంకర్‌రెడ్డి, గొలమారి చెన్నారెడ్డి, గొలమారి సత్యనారాయణరెడ్డి, మౌలాలి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement