దర్శి టీడీపీలో ముసలం
టీడీపీ ఇన్‌చార్జ్ కమీషన్ల దందాతో విసిగిన కేడర్ బయటపడలేక లోలోన మథనపడుతున్న నాయకులు చర్చనీయాంశమైన టీడీపీ నేత సోమేపల్లి శ్రీనివాసరావు చెప్పుతో కొట్టుకున్న వీడియో నియోజకవర్గంలో అసంతృప్త నేతలు మరెందరో..
దర్శి:
దర్శి నియోజకవర్గ టీడీపీలో అసంతృప్త నేతలు రోజు రోజుకూ పెరిగిపోతున్నారు. నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ గొట్టిపాటి లక్ష్మి మళ్లీ పోటీ చేసే ఉద్దేశం లేకపోవడం వల్లే టీడీపీ నేతల వద్దే కమీషన్లు వసూలు చేస్తూ అందిన కాడికి దోచుకుని ఊడ్చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం ముండ్లమూరు మాజీ మండల కన్వీనర్ సోమేపల్లి శ్రీనివాసరావు అయితే ఏకంగా 2024లో టీడీపీ అధికారంలోకి ఎందుకు వచ్చిందా అని తన చెప్పుతో తానే కొట్టుకున్న వీడియో సంచలనంగా మారింది. ఆ వీడియో చూసిన ప్రజలు సైతం అవాక్కయ్యారు. సాధారణంగా పార్టీలో కొనసాగటం ఇష్టం లేకపోతే రాజీనామా చేస్తారు. అయితే తాను సెల్ఫీ వీడియో తీసుకుని మరీ చెప్పుతో కొట్టుకుని ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టారంటే పార్టీ పరిస్థితి నియోజకవర్గంలో ఎంత దారుణంగా ఉందో తెలుస్తోంది. కమ్మ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి, 14 ఏళ్లు పార్టీ మండల కన్వీనర్‌గా పని చేసిన అనుభవం ఉన్న వ్యక్తికే అసహనం పుట్టి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారంటే ఆ దారిలో మరి ఎంత మంది ఉన్నారన్న విషయం చర్చనీయాంశమైంది. ఇటీవల ముండ్లమూరులో ఓ వెంచర్ కు మట్టి తోలకాలు, ఇతర పనుల కాంట్రాక్ట్ మొత్తం వెంచర్ యజమాని వద్ద డీల్ కుదుర్చుకుని ఈయనే ఆ పనులు చేస్తున్నారు. భారీ వెంచర్ వేసేందుకు ఇన్‌చార్జ్ అనుమతి కోసం కోటి రూపాయలు డీల్ కుదిర్చారని, అందులో రూ.60 లక్షలు ఇవ్వగా ఇంకా రూ.40 లక్షలు ఇవ్వాలని సమాచారం. మిగతా డబ్బు కోసం ఆయనపై ఒత్తిడి తీసుకొచ్చారని తెలిసింది. అందులో భాగంగా తలెత్తిన వివాదం కూడా ఆయన చెప్పుతో కొట్టుకోవడానికి ఒక కారణంగా చర్చించుకుంటున్నారు. అంతే కాకుండా గతంలో చేసిన పనుల్లో కమీషన్‌లు ఇవ్వలేదని బిల్లులు అడ్డుకుని వేధిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటువంటి వివాదాల కారణంగానే ఇటీవల కాలంలో టీడీపీ నాయకులు సైతం జనసేన పార్టీలో చేరినట్లు సమాచారం. అధికార పార్టీలో ఇలా నాయకుల అసంతృప్తికి కారణం ఇక్కడ కమీషన్ల దందాలేనని చెప్పుకుంటున్నారు. ఇతర సామాజికవర్గాలకు చెందిన టీడీపీ నాయకుల్లోనూ గొట్టిపాటి లక్ష్మి ఒంటెత్తుపోకడలపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. నియోజకవర్గంలో ఇసుక, మట్టి ఏ నాయకున్నీ తోలుకోనివ్వకుండా మొత్తం ఇక్కడ ఇన్‌చార్జే దోచుకుంటున్నారని ఇసుక వనరులు ఉన్న ప్రాంతాల్లో టీడీపీ నాయకులు సైతం అసంతృప్తిగా ఉన్నారు. గతంలో అధికార పార్టీకి చెందిన టిప్పర్లు ఇన్‌చార్జ్ అనుమతి లేకుండా ఇసుక సరఫరా చేస్తున్నారని కమ్మవారి పాలేనికి చెందిన టీడీపీ నేత లారీని కూడా ఇన్‌చార్జ్ అనుచరులు ధ్వంసం చేశారు. నియోజకవర్గంలో ఎక్కడైనా గ్రావెల్ ఎత్తాలన్నా తమకు కప్పం కట్టాల్సిందేనని హుకుం జారీ చేయడంతో టీడీపీ నేతలు కొందరు టిప్పర్లు కూడా అమ్ముకున్నారు.
ఏ పనిచేయాలన్నా కప్పం కట్టాల్సిందే..
నియోజకవర్గంలో ఏ పనులు చేసినా బిల్లులు చెల్లించాలంటే తమకు కప్పం కట్టాల్సిందేనని హుకుం జారీ చేసి మరీ వసూళ్లు చేస్తున్నారు. గ్రామాల్లో అవకాశం ఉన్న చోట్ల చేపల చెరువులు పాటలు పెట్టకుండానే చేపలు వేయించి అనధికారికంగా దోపిడీకి పాల్పడుతున్నారు. పులిపాడు సమీపంలో పోలీసులను కాపలా పెట్టి మరీ చెరువు పక్కన పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న రోడ్డును తీసి వేసి ఆ రోడ్డు స్థానంలో అర ఎకరా ప్రభుత్వ భూమిని కబ్జా చేసుకునేందుకు భారీ మొత్తంలో డీల్ కుదుర్చుకుని నూతన రోడ్డును పోసి చెరువు భూమిని ఆక్రమించుకున్నారు. ఈ విషయంలో టీడీపీ ఇన్‌చార్జ్ పీఏ భారీ మొత్తంలో వసూళ్లు చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నియోజకవర్గంలో ఎవరైనా అధికారులు పని చేయాలంటే కప్పం కట్టాల్సిందేనన్న విషయం చర్చనీయాంశంగా మారింది. అందులో భాగంగానే ఇటీవల దర్శి ఎంపీడీఓ కార్యాలయంలో ఓ ఉద్యోగిని విధుల్లోకి తీసుకోలేదని సమాచారం. ముండ్లమూరు మండలంలోని ఓ మాజీ ఎంపీపీ కూడా ఇన్‌చార్జ్ తీరుతో తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఆయనకు మండలం పెత్తనం మొత్తం నీదే అని చెప్పడం..ఆ తరువాత అధికారులకు ఫోన్ చేసి ఆయన చెప్పిన పనులు చెయ్యవద్దని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో సీనియర్ నాయకుడైన తనకు విలువ ఇవ్వడం లేదని ఆయన పార్టీ కార్యక్రమాలకు హాజరు కాకుండా దూరంగా ఉంటున్నారు. నియోజకవర్గంలో సీనియర్ నేతలను విస్మరించి పనులు చక్కదిద్దేందుకు పైకం ముట్టచెప్పే వారికే పెద్ద పీట వేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఎంతో మంది సీనియర్ నాయకులు పార్టీ కార్యక్రమాలకు హాజరు కావడం లేదని ఆపార్టీ నేతలే చర్చించుకుంటున్నారు.


