దళితులపై విద్యుత్‌ బకాయిల భారం | - | Sakshi
Sakshi News home page

దళితులపై విద్యుత్‌ బకాయిల భారం

Feb 28 2026 7:09 AM | Updated on Feb 28 2026 7:09 AM

దళితులపై విద్యుత్‌ బకాయిల భారం

దళితులపై విద్యుత్‌ బకాయిల భారం

దళితులపై విద్యుత్‌ బకాయిల భారం ఓటర్ల మ్యాపింగ్‌ ప్రక్రియ పూర్తి చేయాలి గిరిజనుల దాడిలో ఫారెస్టు బీట్‌ ఆఫీసర్‌కు గాయాలు

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: దళితుల ఇళ్లకు వేలకు వేలు విద్యుత్‌ బకాయిలు ఉన్నాయని, వాటిని వెంటనే చెల్లించాలని విద్యుత్‌ అధికారులు చెప్పడంతో వారితో వాగ్వాదానికి దిగిన ఘటన తాళ్లూరు మండలం బొద్దికూరపాడు ఎస్సీ కాలనీలో చోటుచేసుకుంది. కాలనీవాసులు తెలిపిన వివరాల మేరకు శుక్రవారం విద్యుత్‌ అధికారులు కాలనీలో విద్యుత్‌ బకాయిల వసూళ్లకు వెళ్లారు. కాలనీలో 300 కుటుంబాలుంటాయి. కాలనీకి చెందిన మారిపోగు బజారమ్మకు రూ.15 వేలు, మందా మరియమ్మకు రూ.28 వేలు, మందా చిన్న వెంకటయ్యకు రూ.52811 ఇలా దాదాపు 8 కుటుంబాలు వేలాది రూపాయల విద్యుత్‌ బకాయిలు చెల్లించాలని అధికారులు చెప్పారు. బకాయిలు మొత్తం చెల్లించాలని, లేకుంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మారిపోగు బజారమ్మ, మందా మరియమ్మల ఇళ్లలో అసలు విద్యుత్‌ మీటర్లే లేవు. అయితే గతంలో వారి ఇళ్లలో విద్యుత్‌ మీటర్లు ఉన్నాయని, బకాయిలు చెల్లించకపోవడంతో వాటిని తొలగించామని ఆ బకాయిల భారం ఇంత అయిందని విద్యుత్‌ అధికారులు చెబుతున్నారు. వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరులమవడం వల్లే తమకు ఇలా వేలకు వేలు బకాయిలున్నట్లు అధికారులు చెబుతున్నారని దళితులు వాపోయారు. ఇంతింత విద్యుత్‌ బకాయిలు ఎక్కడ నుంచి వచ్చాయని కాలనీవాసులు నిలదీసి విద్యుత్‌ అధికారులతో గొడవకు దిగారు. దీంతో కాలనీకి ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్యుత్‌ సరఫరా నిలిపేశారు. ఈ విషయమై మండల విద్యుత్‌ ఏఈ రామకృష్ణను వివరణ కోరగా పెండింగ్‌ ఉన్న పాత విద్యుత్‌ బకాయిలను గ్రామం మొత్తం వసూలు చేస్తున్నామన్నారు. అలాగే బొద్దికూరపాడు ఎస్సీ కాలనీ వాసులు గత కొన్ని సంవత్సరాలుగా విద్యుత్‌ బకాయిలు చెల్లించడంలేదన్నారు.

రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో డీఆర్‌ఓ

ఒంగోలు సబర్బన్‌: జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఓటర్ల మ్యాపింగ్‌ ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేసేలా ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా రెవెన్యూ అధికారి బీసీహెచ్‌.ఓబులేసు ఏఈఆర్‌ఓలను ఆదేశించారు. శుక్రవారం ఒంగోలు కలెక్టరేట్‌లో జిల్లా రెవెన్యూ అధికారి తన చాంబర్‌లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల సభ్యులతో జిల్లాలోని అన్నీ నియోజకవర్గాల ఏఈఆర్‌ఓలతో సమావేశమయ్యారు. ఓటర్ల మ్యాపింగ్‌ ప్రక్రియ పురోగతి, పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్స్‌ పరిష్కారంపై సమీక్షించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ జిల్లాలో ఓటర్ల మ్యాపింగ్‌ ప్రక్రియ ఇప్పటి వరకు 75.44 శాతం పూర్తి చేశారన్నారు. ఈ నెల 28వ తేదీ, మార్చి 1వ తేదీ, మార్చి 7, 8 తేదీల్లో 4 రోజులు ఓటర్ల మ్యాపింగ్‌ ప్రక్రియపై ప్రత్యేక క్యాంపెయిన్‌ నిర్వహిస్తారన్నారు. సమావేశంలో ఎస్‌డీసీలు మాధురి, జాన్సన్‌, ఎలక్షన్‌ సెల్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాసరావు, వైఎస్సార్‌ సీపీ ప్రతినిధి దామరాజు క్రాంతికుమార్‌ పాల్గొన్నారు.

పెద్దదోర్నాల: ఫారెస్టు బీట్‌ ఆఫీసర్‌పై చెంచు గిరిజనులు దాడి చేసి గాయపరిచిన సంఘటన పెద్దారుట్ల బేస్‌క్యాంపు వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. ఈ సంఘటనలో ఫారెస్టు బీట్‌ ఆఫీసర్‌ మదన్‌కుమార్‌కు గాయాలయ్యాయి. సంఘటనకు సంబంధించి స్థానికుల కథనం మేరకు.. పెద్దారుట్ల వద్ద రోడ్ల విషయమై గిరిజనులకు, ఫారెస్టు సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో గిరిజనులు గడ్డి కోసే కొడవలితో ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌పై దాడికి పాల్పడ్డారు. అతను చేయి అడ్డం పెట్టడంతో చేతికి గాయాలైనట్లు సమాచారం. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు దర్యాప్తులో తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement