తౌషిక్‌ మృతికి కారకులను కఠినంగా శిక్షించాలి | - | Sakshi
Sakshi News home page

తౌషిక్‌ మృతికి కారకులను కఠినంగా శిక్షించాలి

Feb 28 2026 7:09 AM | Updated on Feb 28 2026 7:09 AM

తౌషిక్‌ మృతికి కారకులను కఠినంగా శిక్షించాలి

తౌషిక్‌ మృతికి కారకులను కఠినంగా శిక్షించాలి

కనిగిరిరూరల్‌: సింగరాయకొండ శ్రీ చైతన్య నవోదయ కోచింగ్‌ సెంటర్లో కనిగిరికి చెందిన విద్యార్థి సయ్యద్‌ తౌషిక్‌ (11) మృతికి కారణమైన వారిని గుర్తించి నిందితులను కఠినంగా శిక్షించాలని, కోచింగ్‌ సెంటర్‌ను తక్షణం మూసివేయాలని డిమాండ్‌ చేస్తూ ఏఐఎస్‌ఎఫ్‌, ఏఐవైఎఫ్‌, మహిళా సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా, నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి జీపీ రామారావు మాట్లాడుతూ విద్యార్థి తౌషిక్‌ మృతి చెంది పది రోజులు దాటినా.. అధికారులు కమిటీల పేరుతో కాలయాపన చేయడాన్ని తీవ్రంగా దుయ్యబట్టారు. పూర్తి ఆధారాలు ఇస్తున్నా.. త్రిసభ్య కమిటీ, పోలీస్‌ అధికారులు ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. పోలీసులు, అధికారులు పారదర్శకంగా, నిజాయితీగా వ్యవహరించి తౌషిక్‌ మృతికి కారణమైన నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రైతు సంఘం నియోజకవర్గ కార్యదర్శి గుజ్జుల బాలిరెడ్డి మాట్లాడుతూ తౌషిక్‌ మృతిపై అధికారులు చేస్తున్న జాప్యం, నిర్లక్ష్యం ముమ్మాటికి ప్రభుత్వ కుట్రేనని విమర్శించారు.

న్యాయం చేసేంత వరకు పోరాటం సాగిస్తాం..

తన కుమారుడు తౌషిక్‌ మృతికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించేంత వరకు పోరాటం సాగిస్తామని విద్యార్థి తౌషిక్‌ తండ్రి సయ్యద్‌ ఆలీ అన్నారు. తౌషిక్‌ మృతి చెంది పది రోజులైనా పూర్తి ఆధారాలు చూపిస్తున్నా..పోలీసులు, అధికారులు కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. తన కుమారుడ్ని కోచింగ్‌ సెంటర్‌ యాజమాన్యం, సిబ్బందే హత్య చేశారని ఆరోపించారు. నిందితులను గుర్తించి తక్షణం అరెస్ట్‌ చేయాలని, కోచింగ్‌ సెంటర్‌ను మూసివేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ర్యాలీలో పాల్గొన్న మున్సిపల్‌ చైర్మన్‌ గఫార్‌ మాట్లాడుతూ తౌషిక్‌ మృతిపై దర్యాప్తును వేగవంతం చేయాలన్నారు. పది రోజులైనా పీఎం రిపోర్టు నివేదిక రాకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. అధికారులు, పోలీసులు నిస్పక్షపాతంగా వ్యవహరించి నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో విద్యార్ధి, మహిళా, యువజన, ప్రజా సంఘాల నాయకులు ఎస్‌కే తాహిద్‌, సయ్యద్‌ ఇఫ్రాజ్‌, నాగూర్‌ బీ, బషీర్‌బీ, మద్దిశెట్టి భారతీ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement