బెట్టింగులకు పాల్పడితే ఉపేక్షించేది లేదు | - | Sakshi
Sakshi News home page

బెట్టింగులకు పాల్పడితే ఉపేక్షించేది లేదు

Feb 27 2026 4:11 AM | Updated on Feb 27 2026 4:11 AM

బెట్ట

బెట్టింగులకు పాల్పడితే ఉపేక్షించేది లేదు

సాక్షి కథనాన్ని సీరియస్‌గా తీసుకున్న ఎస్పీ హర్షవర్థన్‌రాజు జిల్లా వ్యాప్తంగా పోలీసుల తనిఖీలు ఒంగోలులో 11 బృందాలుగా ఏర్పడి జల్లెడ పట్టిన పోలీసులు సింగరాయకొండలో పలువురు అదుపులోకి..

ఒంగోలు టౌన్‌: క్రికెట్‌ బెట్టింగులపై జిల్లా పోలీసులు కొరఢా ఝలిపించారు. ‘బెట్టింగ్‌ మామూళ్లే’ అనే పతాక శీర్షికతో గురువారం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనాన్ని ఎస్పీ హర్షవర్థన్‌రాజు సీరియస్‌గా తీసుకున్నారు. పోలీసు అధికారులకు క్లాస్‌ తీసుకున్నట్లు విశ్వనీయ సమాచారం. అంతేగాకుండా వెంటనే రంగంలోకి దిగి బెట్టింగ్‌ రాయుళ్ల పనిపట్టాల్సిందిగా ఆదేశించారు. దాంతో పోలీసులు వెంటనే రంగ ప్రవేశం చేశారు. డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఒంగోలు వన్‌టౌన్‌ సీఐ నాగరాజు, టూ టౌన్‌ సీఐ మేడా శ్రీనివాసరావు, తాలూకా సీఐ విజయకృష్ణ, 8 మంది ఎస్సైలు, సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. సిబ్బంది మొత్తం 11 బృందాలుగా ఏర్పడి తమ పరిధిలోని టీ షాపులు, బార్లు, హాస్టళ్లు, ఇతర ప్రదేశాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నగరంలో జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, గుంపులుగా గుమిగూడి ఉండే ప్రాంతాల్లో వ్యక్తుల మొబైల్‌ ఫోన్లను పరిశీలించారు. క్రికెట్‌ బెట్టింగులకు సంబంధించి వివిధ యాప్‌ల వినియోగంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ క్రికెట్‌ బెట్టింగులకు పాల్పడినా, ప్రోత్సహించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మధ్యవర్తులను కూడా వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. టీ 20 వరల్డ్‌ కప్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు జరుగుతున్న నేపథ్యంలో యువత అప్రమత్తంగా ఉండాలని, బెట్టింగుల జోలికి వెళ్లి ఆర్థికంగా నష్టపోవద్దని హితవు పలికారు. క్రికెట్‌ను ఒక ఆటగా ఆస్వాదించాలని, వ్యసనంగా చూడవద్దని సూచించారు. కష్టపడకుండా ఊరికే డబ్బులు రావని, రెట్టింపు నగదు వస్తుందని చెప్పే మాటలు నమ్మవద్దని హితవు పలికారు. గతంలో బెట్టింగులకు పాల్పడిన వారిపై, అనుమానితులపై నిఘా ఉంచినట్లు చెప్పారు. ఎక్కడైనా క్రికెట్‌ బెట్టింగు జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే 112, డయల్‌ 100, సమీపంలోని పోలీసు స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.

సింగరాయకొండలో బుకీల పరార్‌...

క్రికెట్‌ బెట్టింగులకు అడ్డాగా మారిన సింగరాయకొండలో బుకీలు పరారయ్యారు. సాక్షి దినపత్రికలో కథనం ప్రచురితమైన నేపథ్యంలో పోలీసులు దాడులు చేసే అవకాశం ఉందని భావించిన బుకీలు జాగ్రత్త పడినట్లు సమాచారం. అయితే, క్రికెట్‌ బెట్టింగులకు సంబంధించి ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరిని మధ్యాహ్నమే వదిలిపెట్టగా, మిగిలిన నలుగురిని పోలీసు స్టేషన్‌లోనే ఉంచడంపై పలు రకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అధికార పార్టీ ఒత్తిడి వలనే ఒక్కరిని వదిలిపెట్టినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా అసలు వ్యక్తుల జోలికి వెళ్లకుండా క్రికెట్‌ బెట్టింగులతో సంబంధం లేని వారిని తీసుకొచ్చి పోలీసులు షో చేస్తున్నారని కొందరు చెవులు కొరుక్కుంటున్నారు.

బెట్టింగులకు పాల్పడితే ఉపేక్షించేది లేదు 1
1/1

బెట్టింగులకు పాల్పడితే ఉపేక్షించేది లేదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement