విద్యా వ్యవస్థలో పేరుకుపోయిన సమస్యలు
ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షురాలు మంజుల ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా
ఒంగోలు సిటీ: ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా విద్యా వ్యవస్థలో సమస్యలు పేరుకుపోయాయని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షురాలు సీహెచ్ మంజుల ధ్వజమెత్తారు. 44 సమస్యల పరిష్కారం కోసం ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యమాలకు పిలుపునివ్వడం జరిగిందన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్ వద్ద ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షురాలు మంజుల పాల్గొని మాట్లాడుతూ ఉపాధ్యాయులకు యాప్‌ల భారాన్ని, ఆన్‌లైన్ పని భారాన్ని తగ్గించి బోధనా కార్యక్రమాలకే పరిమితం చేయాలని డిమాండ్ చేశారు. 12వ పీఆర్సీ కమిషన్‌ను వెంటనే నియమించాలన్నారు. 30 శాతం మధ్యంతర భృతి, 11వ పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లించాలని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న నాలుగు విడతల డీఏలు ప్రకటించాలన్నారు. ఉద్యోగులకు సీపీఎస్, పెన్షనర్లకు నగదు రూపంలో డీఏ బకాయిలు చెల్లించాలన్నారు. విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి ఉన్నత పాఠశాలకు హెడ్మాస్టర్, పీడీ పోస్టులు మంజూరు చేయాలన్నారు. పెన్షనర్లకు 70 సంవత్సరాలకు 10 శాతం, 75 సంవత్సరాలకు 15 శాతం అడిషనల్ క్వాంటం పెన్షన్‌ను పునరుద్ధరించాలన్నారు. టెట్ నుంచి ఇన్‌సర్వీస్ టీచర్లను మినహాయించాలన్నారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు జీవో 57 ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలన్నారు. ఎంఈఓ–1, ఎంఈఓ–2లకు జాబ్ చార్టులో బాధ్యతలు సమానంగా కేటాయించాలన్నారు. ఉన్నత పాఠశాలల నుంచి 1 నుంచి 5 తరగతులను వేరుచేయాలన్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పెరిగిన జనాఽభాకు అనుగుణంగా నూతన పాఠశాలలు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.శేషారావు, జోన్ కన్వీనరు ఎస్‌కే బషీరున్నీసా, రమేష్, రాష్ట్ర కౌన్సిలర్ డి.శ్రీనివాసులు, ఎన్.గోపాలరెడ్డి, బి.రఘబాబు, ఐ.విజయసారధి, ఎస్‌జీపీఏ నాయకులు పి.సుబ్బారావు, కె.సుబ్బారావు, అంకిరెడ్డి, తదితర నాయకులు పాల్గొన్నారు.


