చెత్తకుప్పలో గర్భిణుల ఔషధాలు | - | Sakshi
Sakshi News home page

చెత్తకుప్పలో గర్భిణుల ఔషధాలు

Feb 27 2026 4:11 AM | Updated on Feb 27 2026 4:11 AM

చెత్తకుప్పలో గర్భిణుల ఔషధాలు

చెత్తకుప్పలో గర్భిణుల ఔషధాలు

పెద్దదోర్నాల:

ర్భిణులు, రక్తహీనత కలిగిన రోగులకు ఇచ్చే ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌ ఔషధాలు చెత్తకుప్పలో దర్శనమివ్వడం పెద్దదోర్నాలలో గురువారం కలకలం రేపింది. మండల కేంద్రానికి కొద్దిపాటి దూరంలో బైపాస్‌ రోడ్డు సమీపంలోని ఓ ఖాళీ స్థలంలో ఆ మందులు పడేయడం వైద్యాధికారులు, సిబ్బంది నిర్లక్ష్యానికి నిదర్శనంగా ఉంది. మండల పరిధిలో పలు గిరిజన గూడేలు ఉన్నాయి. ఆయా గూడేల్లో నివసిస్తున్న చెంచు గిరిజనులు ఎక్కువగా రక్తహీనతతో బాధపడుతుంటారు. అటువంటి వారి కోసం ప్రభుత్వం లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఐరన్‌ మాత్రలు, ఐరన్‌ ఫోలిక్‌ యాసిడ్‌ సిరప్‌లు సరఫరా చేస్తుంటుంది. ముఖ్యంగా చెంచు గిరిజనుల్లో మాతాశిశు మరణాలు నివారించేందుకు గర్భిణులు రక్తహీనతను అధిగమించేందుకు ఆయా మందులను ఎక్కువగా వినియోగిస్తుంటారు. అటువంటి మందులను అవసరమైన వారికి సక్రమంగా వినియోగించకుండా రోడ్ల పక్కన చెత్తకుప్పలో పడేయడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. చెంచు గిరిజనులే కాకుండా ఇతర మైదాన ప్రాంతాలకు చెందిన గర్భిణులు సైతం రక్తహీనతతో బాధపడుతున్నారు. అటువంటి వారికి ఉపయోగపడే విలువైన మందులను ఎవరికీ పనికిరాకుండా రోడ్డు పక్కన చెత్తకుప్పలో వేయడాన్ని పలువురు విమర్శిస్తున్నారు. ఆయా ఔషధాలు ఏ వైద్యశాలకు చెందినవో అధికారులు విచారించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement