కేరాఫ్ చంద్రబాబు
క్రెడిట్ చోరీకి
మార్కాపురం టౌన్:
రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి చెందినా ఆ ఘనత నాదేనంటూ క్రెడిట్ చోరీకి కేరాఫ్ అడ్రస్‌గా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిలుస్తాడని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నెల్లూరు పార్లమెంట్ పరిశీలకుడు జంకె వెంకటరెడ్డి విమర్శించారు. తన నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1996లో వెలిగొండ ప్రాజెక్టుకు నేనే శంకుస్థాపన చేశానని, జూలై నాటికి ప్రాజెక్టును పూర్తిచేసి జాతికి అంకితం చేస్తానని మార్కాపురంలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు.
చంద్రబాబు ఆత్మ విమర్శ చేసుకో..
ప్రాజెక్టుకు మీ హయాంలో ఏ మేర నిధులు మంజూరు చేశారో ఆత్మ విమర్శ చేసుకోవాలని కోరారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో రూ.3500 కోట్లతో జర్మనీతో పాటు ఇతర దేశాల నుంచి పరికరాలను తెప్పించి టన్నెల్ నిర్మాణం చేపట్టడంతో పాటు గొట్టిపడియ, సుంకేశుల, కాకర్ల గ్యాప్‌లను నిర్మించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించి 30 ఏళ్లు అవుతుందని, మీ హయాంలో ప్రాజెక్టు నిర్మాణానికి మంజూరు చేసిన నిధులను ప్రజలకు తెలపకుండా నేనే ప్రారంభించా.. నేనే పూర్తి చేస్తా.. అంటూ క్రెడిట్ చోరీకి పాల్పడటమే ఆయన ప్రత్యేకత అన్నారు. 2014 నుంచి 2019 వరకు బడ్జెట్‌లో ప్రాజెక్టు నిర్మాణం కోసం మంజూరు చేసిన నిధులను బహిరంగ సభలో తెలిపితే సులభతరంగా ప్రజలు అర్థం చేసుకుంటారన్నారు. అబద్ధాలతో పూట గడుపుకోవడం చంద్రబాబుకు కొత్తేం కాదన్నారు. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేయాలంటే ఆర్‌ఆర్ ప్యాకేజీ, వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణానికి సుమారు రూ.1250 కోట్లు అవసరమని చెప్పిన నువ్వే బడ్జెట్‌లో కేవలం రూ.496 కోట్లను ప్రకటించి ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు మేధావులు, వివిధ సంఘాల నాయకులు 2 నుంచి 3 వేల కోట్లు కేటాయిస్తేనే తప్ప పూర్తికాదన్న నినాదాలను కూడా పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. టన్నెల్ పనులు పూర్తి చేయకుండానే టన్నెల్ లోనికి ఎలా వెళ్లారని మీకు తెలీదా అన్నారు. 30 ఏళ్లుగా వెలిగొండ ప్రాజెక్టుపై మీరు చెబుతున్న అబద్ధాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. తుఫాన్లతో రైతులు పంటలను నష్టపోవడంతో పాటు పెట్టిన పెట్టుబడులు కూడా రాకపోగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతుంటే నష్టపరిహారం ఇచ్చి ఏనాడైనా రైతులను ఆదుకున్నావా అని ప్రశ్నించారు.
వెలిగొండ ప్రాజెక్టుకు నిధులు
కేటాయించకుండా ఎలా ప్రారంభిస్తారు..?
వైఎస్సార్ హయాంలోనే వెలిగొండ
ప్రాజెక్టు నిర్మాణం
మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నెల్లూరు
పార్లమెంట్ పరిశీలకుడు జంకె వెంకటరెడ్డి
అప్పుడు దొనకొండ..ఇప్పుడు మార్కాపురం హబ్
గతంలో దొనకొండను ఇండస్ట్రీయల్ హబ్ చేస్తానని చెప్పాకొని, ఇప్పుడు మార్కాపురాన్ని హార్టికల్చర్ హబ్‌గా మరుస్తానంటూ చెబుతున్నారని, మీ మాటలు ఈ ప్రాంత ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. మార్కాపురం జిల్లాను ప్రకటించి కేవలం కలెక్టరేట్ నిర్మాణానికి రూ.50కోట్లు ప్రకటించారే గానీ నాలుగు నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తూ ప్రజలకు హామీ ఇచ్చిన దాఖలాలు లేవని అన్నారు. రీసర్వేపై రైతులకు న్యాయం చేస్తానని, భూ కబ్జాలకు పాటుపడితే అధికారుల తాటతీస్తారని గొప్పలు చెప్పిన చంద్రబాబు..మార్కాపురం నియోజకవర్గంలో భూ కబ్జాలు చేస్తూ ఇసుక, మట్టి దందాలు చేస్తూ కోట్లు గడిస్తున్న ఎమ్మెల్యేపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో ప్రజలకు తెలపలేదన్నారు. అరకొరగా ఒకటీ రెండూ పథకాలు అమలు చేసి సూపర్స్ అన్నీ పథకాలు అమలు చేశామని గొప్పలు చెప్పుకోవడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను ప్రారంభిస్తే వాటిని పూర్తి చేయకుండా పీపీపీ అంటూ వాటికి మంగళం పలికింది నువ్వుకాదా అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అంటూ మంగళవారం వేలకోట్ల రూపాయలు అప్పులకు పోతున్నది నువ్వుకాదా ప్రశ్నించారు. జలజీవన్ మిషన్ కింద గత ప్రభుత్వంలోనే నిధులు మంజూరు చేసి నిర్మాణాలు చేపడితే మీ హయాంలోనే అని గొప్పలు చెప్పుకుంటూ ప్రారంభించిన పథకాన్ని మళ్లీ ప్రారంభించడం మీకే చెల్లిందని విమర్శించారు. మార్కాపురం జిల్లా ప్రజల ఆశలపై నీళ్లు చల్లి వెళ్లినట్లుగా పర్యటన ఉందని ప్రజలు బహిరంగంగా చర్చించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ నాయకులు నల్లబోతుల కొండయ్య, ధర్మా నాయక్, గౌస్ మొహిద్దీన్, సాంబశివారెడ్డి, సీహెచ్ రమణారెడ్డి, శివారెడ్డి తదితరులు ఉన్నారు.


