జిల్లాలో 60 వేల వెబ్‌ల్యాండ్ పెండింగ్ కేసులు
యర్రగొండపాలెం: మార్కాపురం జిల్లాలో వెబ్‌ల్యాండ్ పెండింగ్ కేసులు 60వేలు ఉన్నాయని, ఈ సమస్యతో జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉందని జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు అన్నారు. స్థానిక రెవెన్యూ కార్యాలయంలో వీఆర్‌ఓలు, సర్వేయర్లతో రీ సర్వేలో ఉన్న లోటుపాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ విలేకరులతో మాట్లాడుతూ రీ సర్వేలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని, భూముల ఫీడ్‌బ్యాక్‌లో వాస్తవ లబ్ధిదారుల పేర్లు ఉన్నా అప్పటి మండల రెవెన్యూ అధికారులు వెబ్‌ల్యాండ్‌లో ఇతరులు అని నమోదు చేయడంతో ఈ సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. సమస్యలను 6 నెలల్లోగా అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. వీఆర్‌ఓలు, సర్వేయర్లకు శిక్షణ ఇచ్చామని, మ్యూటేషన్ కారణాలతో ఆన్‌లైన్ జరగకుండా నిలిచిపోయిన వాటిని పరిశీలించి వాటికి సంబంధించిన డాక్యుమెంట్ ఎవిడెన్స్‌లు ఉంటేనే ఆన్‌లైన్ చేయడం, లేకుంటే వాటిని పెండింగ్‌లో పెడతామని చెప్పారు. గ్రీవెన్స్‌లో జేసీ, ఆర్డీఓల వద్ద అర్జీలు దాఖలు చేసిన వారు అనేక మంది రైతులు ఉన్నారని, వాటిని కూడా పరిశీలిస్తున్నామనన్నారు. గతంలో వాగు పోరంబోకు భూమలకు కూడా పట్టాలు ఇచ్చారని, వారు భూమిపై ఉన్నా ఆన్‌లైన్‌లో వారి పేర్లు నమోదై ఉండవని తెలిపారు. ఇప్పుడు ఆన్‌లైన్ కాకుండా ఉంటే మరెప్పుడూ ఆన్‌లైన్ కావని, అందుకే రానున్న 6 నెలల్లో ప్రత్యేక దృష్టి సారించి సమస్యలనుపరిష్కరిస్తామన్నారు. రీసర్వే ప్రక్రియకు ప్రజల సహకారం కావాలని, సాగు చేసుకుంటున్న భూములకు తగిన ఆధారాలు లేకుంటే తామేమీ చేయలేమని ఆయన తెలిపారు. కోర్టులో ఉన్న పెండింగ్ కేసులు కూడా తమ పరిధిలోకి తీసుకొని పరిశీలిస్తామని, 22ఏలో ఉన్న వాటిపై కూడా ప్రత్యేకంగా విచారించి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. తండ్రి మరణాంతరం అన్నదమ్ములు సివిల్ వివాదాల్లో ఉన్న కేసులు అనేకం ఉన్నాయని, వారికి ఉన్న హక్కుపై విచారించి ఆ కేసులు కూడా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. సమావేశంలో తహసీల్దార్ మంజునాథరెడ్డి ఉన్నారు.


