రైలు నుంచి పడిపోయిన బాలిక
రైల్వేస్టేషన్
(విజయవాడపశ్చిమ): కదులుతున్న రైలు నుంచి ప్రమాదవశాత్తూ ఓ బాలిక పడిపోయింది. సకాలంలో స్పందించిన ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ, స్టేషన్ సిబ్బంది సమన్వయంతో బాలికను రక్షించారు. ఈ ఘటన బుధవారం రాత్రి ఒంగోలు రైల్వేస్టేషన్ పరిసరాల్లో జరిగింది. బుధవారం రాత్రి 11.53 గంటల సమయంలో ధర్మవరం – నర్సాపూర్ (17248) ఎక్స్‌ప్రెస్ రైలు ఒంగోలు స్టేషన్‌కు రెండు మీలోమీటర్ల దూరంలో సూరారెడ్డిపాలెం – ఒంగోలు సెక్షన్ మధ్యలో ప్రయాణిస్తుండగా తొమ్మిదేళ్ల బాలిక ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడిపోయింది. రైలు రాత్రి 12.03 గంటలకు రైలు ఒంగోలు స్టేషన్‌కు చేరుకోగా ఆమె కుటుంబ సభ్యులు స్టేషన్ మాస్టర్, ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు అప్రమత్తమయ్యారు. వెంటనే ఆ మార్గంలో వస్తున్న తిరుపతి – కరీంనగర్ ఎక్స్‌ప్రెస్ (12761) రైలులోని సిబ్బందిని అప్రమత్తం చేశారు. లోకో పైలెట్ ట్రాక్ పక్కన పడిపోయిన బాలికను గుర్తించి రైలును నిలపడంతో జనరల్ కోచ్‌లోని సిబ్బంది ఆమెను రక్షించారు. అప్పటికే ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ సిబ్బంది కూడా బాలిక కోసం గాలిస్తూ అక్కడకు చేరుకున్నారు. గాయాలతో ఉన్న బాలికను ఒంగోలు స్టేషన్‌కు తరలించారు. ఆమె ఎడమ చేతికి, కాళ్లకు స్పల్ప గాయాలు కావడంతో ప్రథమ చికిత్స చేసి, అనంతరం దగ్గరలోని ఆస్పత్రిలో చికిత్స చేయించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి బాలికను రక్షించిన రైల్వే సిబ్బంది, ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ పోలీసులకు ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.


