పూలసుబ్బయ్య పేరు ప్రస్తావించకపోవడం బాధాకరం
● చంద్రబాబు తీరుపై సీపీఐ నేతల ఆగ్రహం
మార్కాపురం: వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణానికి ఆధ్యుడైన పూలసుబ్బయ్య పేరును మార్కాపురం బహిరంగ సభలో సీఎం చంద్రబాబునాయుడు, కూటమి నాయకులు ప్రస్తావించకపోవడం బాధాకరమని సీపీఐ రాష్ట్ర నాయకులు అందె నాసరయ్య, నియోజకవర్గ పార్టీ కార్యదర్శి ఎస్‌కే ఖాశీం అన్నారు. స్థానిక పూలసుబ్బయ్య శాంతి భవన్‌లో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రాజెక్టు సాధన కోసం అవిశ్రాంత పోరాటాలు చేసిన పూలసుబ్బయ్య సేవలను దృష్టిలో ఉంచుకుని నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పెద్ద మనసుతో వెలిగొండ ప్రాజెక్టుకు ముందు పూలసుబ్బయ్య పేరును జత చేసి పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుగా నామకరణం చేశారని గుర్తు చేశారు. సీఎం పర్యటన సందర్భంగా ఎన్‌డీఏ కూటమి నాయకులు ప్రదర్శించిన ఫ్లెక్సీల్లో ఎక్కడా కూడా పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు అని పేర్కొనలేదని గుర్తుచేశారు. దీన్ని బట్టి కూటమి ప్రభుత్వానికి పూలసుబ్బయ్య అన్నా.. ప్రాజెక్టుపైనా.. ఎంత శ్రద్ధ ఉందో అర్థమవుతుందన్నారు. ఆయన పేరును ప్రస్తావించడమంటే భవిష్యత్ తరాలకు గొప్ప నిస్వార్ధ సేవలకు ప్రతిరూపమైన వ్యక్తులను పరిచయం చేయడమే అన్నారు. భవిష్యత్‌లోనైనా ఇలాంటి తప్పులు చేయవద్దని కూటమి నాయకులకు వారు హితవు పలికారు.


