ఉప్పుగుండూరులో పత్తేపారం! | - | Sakshi
Sakshi News home page

ఉప్పుగుండూరులో పత్తేపారం!

Feb 26 2026 9:13 AM | Updated on Feb 26 2026 9:13 AM

ఉప్పుగుండూరులో పత్తేపారం!

ఉప్పుగుండూరులో పత్తేపారం!

ఉప్పుగుండూరులో పత్తేపారం! రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

తన ఇంటినే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చిన మహిళ

మాజీ భర్త ఫిర్యాదుతో యువతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

నాగులుప్పలపాడు: మండలంలోని ఉప్పుగుండూరు గ్రామంలో అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడి చేసి పలువురు యువతులను బుధవారం అదుపులోకి తీసుకున్నారు. గ్రామానికి చెందిన ఓ మహిళ గత కొంత కాలంగా భర్తకు దూరంగా ఇదే గ్రామంలో ఉంటోంది. ఈ క్రమంలో పలువురు యువతులు, యువకులు ఆమె ఇంటికి తరచూ రాకపోకలు సాగిస్తున్నారు. ఈ తతంగంపై పోలీసులకు ఆమె భర్త, స్థానికులు సమాచారం ఇవ్వగా చర్యలు తీసుకోకుండా తాత్సారం చేశారు. కొంత మంది పోలీసు సిబ్బంది సహకారం కూడా ఉండటంతో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లకుండా జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా మంగళవారం రాత్రి కొంత మంది యువతులు సదరు మహిళ ఇంటికి వచ్చారు. ఇది గమనించిన ఆమె భర్త వారి వివరాలు సేకరించేందుకు ప్రయత్నించాడు. దీంతో కొత్తగా వచ్చిన యువతులు, స్థానిక యువకులు అతనిపై దాడి చేశారు. క్షతగాత్రుడి ఫిర్యాదుతో బుధవారం పోలీసులు ఎట్టకేలకు స్పందించారు. వివరాలు బయటకు పొక్కకుండా, కేసు నమోదు చేయకుండా గ్రామానికి చెందిన అధికార పార్టీ నేత ఒకరు పోలీసులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. నేరుగా పోలీస్‌ స్టేషన్‌లో రాజీ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

త్రిపురాంతకం: ఎదురుగా వస్తున్న మినీ ట్రక్‌ను తప్పించే క్రమంలో చేపల లోడు లారీ రోడ్డు మార్జిన్‌లోని పొలాల్లో బోల్తా పడింది. త్రిపురాంతకం మండలంలోని దివేపల్లి సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో లారీ క్లీనర్‌ షేక్‌ షౌకత్‌(40) మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. వైఎస్సార్‌ కడప జిల్లా వేంపల్లి నుంచి లారీలో పచ్చి చేపల లోడ్‌ చేసుకుని డ్రైవర్‌ షేక్‌ మౌలాలి, క్లీనర్‌ షౌకత్‌, కాశిం విజయవాడ బయలుదేరారు. త్రిపురాంతకం మండలం దివేపల్లి సమీపంలో ఎదురుగా వస్తున్న మినీ ట్రక్‌ను తప్పించే క్రమంలో లారీ డ్రైవర్‌ మౌలాలి చాకచక్యంగా వ్యవహరించాడు. అయితే లారీ పల్టీలు కొట్టి పక్కనే ఉన్న వ్యవసాయ భూమిలో పడింది. క్లీనర్‌ షౌకత్‌కు తీవ్ర గాయాలు కాగా కాశిం, మౌలాలి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో వైపాలెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ షౌకత్‌ మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా బోల్తా పడిన లారీలో చేపలను చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీసుకువెళ్లారు.

Advertisement
 
Advertisement
Advertisement