తౌషిక్‌ మృతిపై సిట్టింగ్‌ జడ్జితో విచారించాలి | - | Sakshi
Sakshi News home page

తౌషిక్‌ మృతిపై సిట్టింగ్‌ జడ్జితో విచారించాలి

Feb 26 2026 9:13 AM | Updated on Feb 26 2026 9:13 AM

తౌషిక్‌ మృతిపై సిట్టింగ్‌ జడ్జితో విచారించాలి

తౌషిక్‌ మృతిపై సిట్టింగ్‌ జడ్జితో విచారించాలి

సింగరాయకొండ: మండల కేంద్రమైన సింగరాయకొండలోని శ్రీచైతన్య నవోదయ స్కూల్లో విద్యార్థి తౌషిక్‌(11) అనుమానాస్పద మృతిపై సిట్టింగ్‌ జడ్జి లేదా రిటైర్డ్‌ జడ్జితో విచారణ జరిపించాలని, త్రీమెన్‌ కమిటీ విచారణ నివేదిక వెంటనే విడుదల చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్‌ చేశాయి. స్థానిక ప్రజాసంఘాల కార్యాలయంలో బుధవారం శ్రీతౌషిక్‌ కుటుంబానికి అండగా నిలుద్దాంశ్రీ అనే అంశంపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ.. తౌషిక్‌ మృతి ఒక కుటుంబానికి విషాదం మిగల్చటమే కాకుండా విద్యావ్యవస్థలో కొనసాగుతున్న అక్రమాలు, నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపాలకు నిదర్శనమని ఆరోపించారు. ఈ ఘటనపై విద్యాశాఖాధికారులు త్వరగా స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించటం, విచారణ నివేదికను విడుదల చేయడంలో జాప్యం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. తౌషిక్‌ గత రెండేళ్లుగా శ్రీచైతన్య నవోదయ స్కూల్లో చదువుతుండగా కనిగిరిలోని ప్రగతి విద్యాలయంలో హాజరు వేయడాన్ని తప్పుబట్టారు. ఇది విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధమని, దీనిపై సమగ్ర విచారణ చేపట్టి దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. చైతన్య పాఠశాలలో నవోదయ కోచింగ్‌, సైనిక్‌ స్కూల్‌ ప్రవేశాలకు అనుమతులు ఉన్నాయా లేదా అనేది ప్రభుత్వం స్పష్టం చేయాలని కోరారు. ట్రేడ్‌ లైసెన్స్‌ లేకుండా వసతి గృహం నిర్వహించడం విద్యార్థుల భద్రతకే ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. చైతన్య స్కూల్లో 400 మంది విద్యార్థులు ఉండగా, వీరంతా వేర్వేరు పాఠశాలల్లో చదువుతున్నట్లు ఆధారాలు బయటపడటం విద్యాశాఖలో డొల్ల తనాన్ని స్పష్టం చేస్తోందన్నారు. తౌషిక్‌ అనుమానాస్పద మృతిపై వాస్తవాలు వెలుగులోకి వచ్చే వరకు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పోరాడతామని ప్రకటించారు. పలు ప్రజా సంఘాలు, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement