బెట్టింగ్‌ మామూళ్లే! | - | Sakshi
Sakshi News home page

బెట్టింగ్‌ మామూళ్లే!

Feb 26 2026 9:11 AM | Updated on Feb 26 2026 9:11 AM

బెట్టింగ్‌ మామూళ్లే!

బెట్టింగ్‌ మామూళ్లే!

సాక్షి ప్రతినిధి, ఒంగోలు:

ప్రస్తుతం టీ– 20 వరల్డ్‌ కప్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు జరుగుతున్న నేపథ్యంలో బెట్టింగ్‌ వ్యవహారం మళ్లీ తెరమీదకు వచ్చింది. బుకీలు రంగంలోకి దిగారు. ఎవరికి ముట్టజెప్పాల్సింది వారికి ముట్టజెప్పి గుట్టుచప్పుడు కాకుండా బెట్టింగ్‌ కొనసాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా జిల్లాలో రాష్ట్ర సాంఘిక శాఖామంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి సొంత నియోజకవర్గంలో బెట్టింగ్‌ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. ఇదే నియోజకవర్గానికి చెందిన ఓ కీలకనేత తండ్రితో ఒక ఒప్పందం చేసుకున్న బుకీలు అమాయకులకు వల విసురుతున్నట్లు సమాచారం. కొండపి నియోజకవర్గంలోని సింగరాయకొండ కేంద్రంగా జిల్లాలో బెట్టింగ్‌ దందా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ గతంలో బెట్టింగ్‌లలో నష్టపోయి ఆత్మహత్యలు చేసుకున్న వారు ఉన్నారు. ఊరొదిలి పోయినవారూ ఉన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వరల్డ్‌ కప్‌నకు ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన పోలీసు అధికారులు పత్తా లేకుండా పోయారు. కనీసం తనిఖీలు నిర్వహించడం, పాత ఆటగాళ్లను పిలిపించి కౌన్సిలింగ్‌ ఇవ్వడం వంటివేమీ చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ నాయకులు, అధికారులు కుమ్మక్కయ్యారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మామా అల్లుళ్ల బెట్టింగ్‌ వ్యాపారం...

జరుగుమల్లి మండలంలోని చింతలపాలెం గ్రామానికి చెందిన మామా అల్లుళ్లు గ్రామీణ ప్రాంతాలకు చెందిన అమాయక యువకులను క్రికెట్‌ బెట్టింగ్‌ ఉచ్చులోకి దింపుతున్నట్లు సోమవారం కలెక్టర్‌ కార్యాలయంలో జరిగిన మీ కోసంలో కాకుటూరివారిపాలెం గ్రామస్తుడు పాతూరి మదన్‌కుమార్‌ ఫిర్యాదు చేయడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం... మదన్‌కుమార్‌ జరుగుమల్లి మండలంలోని చింతపాలెం గ్రామంలో అమ్మమ్మ, తాతయ్యల వద్ద ఉండి చదువుకుంటున్నాడు. అదే గ్రామానికి చెందిన అధికార టీడీపీ సానుభూతిపరులైన క్రికెట్‌ బుకీలు దండే హేమంత్‌ కుమార్‌, అతడి మేనమామ కంచర్ల శ్రీనివాసరావు పరిచమయ్యారు. బెట్టింగులో డబ్బులు పెడితే భారీగా డబ్బులు వస్తాయని ఆశ చూపారు. బెట్టింగు కోసమని పెట్టుబడిగా గ్రామానికి చెందిన ఒక వ్యక్తి దగ్గర రూ.3.20 లక్షలు అప్పుగా ఇప్పించారు. అవన్నీ బెట్టింగ్‌లో పోయాయి. ఇప్పుడు డబ్బులు చెల్లించాలని మదన్‌ మీద ఒత్తిడి చేస్తున్నారు. పోలీసు కేసు పెడతామని బెదిరింపులకు దిగుతున్నారు. గతంలో ఇలాంటి ఘటనలు జరిగిన దాఖలాలు ఉన్నాయి. శానంపూడికి చెందిన వైద్యశాఖలో పనిచేసే ఒక ఉద్యోగి బెట్టింగులలో పెట్టుబడి పెట్టి అప్పుల పాలై రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సింగరాయకొండకు చెందిన అనేక మంది లారీ ఓనర్లు తీవ్రంగా నష్టపోయి అంతా పోగొట్టుకుని క్లీనర్లుగా మారిపోయారు. మరెంతోమంది ఊరొదిలి పారిపోయారు. ఇప్పుడు అదే ఘటనలు పునరావృతమమవుతుండడంతో సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

కొండపి నియోజకవర్గంలో భారీగా...

కొండపి నియోజకవర్గంలోని సింగరాయకొండ, జరుగుమల్లి మండలాల్లో బుకీలు కొందరు మళ్లీ బెట్టింగులు మొదలు పెట్టినట్లు సమాచారం. సింగరాయకొండ, గవదగుంట్లవారిపాలెం, మూలగుంటపాడు, ఫకీరుపాలెం గ్రామాలకు చెందిన బుకీలు సింగరాయకొండ గ్రామంలోని కందుకూరు ఫ్‌లై ఓవర్‌ కింద, దాని పరిసరాలలో కొత్తగా వెలిసిన టీ స్టాళ్లు కేంద్రంగా చేసుకుని క్రికెట్‌ బెట్టింగులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా సింగరాయకొండ గ్రామంలోని ఓల్డ్‌ ట్రంక్‌ రోడ్డులో టీడీపీ నాయకుడికి చెందిన ఒక రెస్టారెంట్‌లో క్రికెట్‌ బెట్టింగులు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. జరుగుమల్లి మండలంలో కూడా జోరుగా బెట్టింగులు నడుస్తున్నట్లు తెలుస్తోంది. టంగుటూరు మండలంలో పోలీసు అధికారుల కనుసన్నల్లోనే బెట్టింగు వ్యవహారం నడుస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్క కొండపి నియోజకవర్గంలోని సింగరాయకొండ పరిసరాల్లో 25 మంది వరకు బుకీలు ఉన్నట్లు సమాచారం. 70 నుంచి 100 మంది వరకు సబ్‌ బుకీలను ఏర్పాటు చేసుకుని ఊరూర, వాడవాడలా బెట్టింగులు నిర్వహిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారని తెలుస్తోంది.

జిల్లా కేంద్రంలోనూ రెచ్చిపోతున్న మాఫియా...

జిల్లా కేంద్రమైన ఒంగోలులో కూడా క్రికెట్‌ బెట్టింగు జోరుగా నడుస్తున్నట్లు సమాచారం. ఇటీవల కాలంలో సింగిల్‌ నంబర్‌ లాటరీ ఆగిపోవడంతో కొందరు వ్యసనపరులు క్రికెట్‌ బెట్టింగులవైపు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. ఇస్లాంపేట, గోపాలనగర్‌, భాగ్యనగర్‌, సుజాత నగర్‌, సత్యనారాయణపురం, రాజాపానగళ్‌ రోడ్డు, సంతపేటలోని ఆర్‌అండ్‌బీ బంగ్లా పరిసరాలు, ఆర్టీఓ కార్యాలయం పరిసరాలు, వల్లూరు, పెళ్లూరు పరిసరాలు, నల్లవాగు, కొత్తకూరగాయల మార్కెట్‌, రద్దీ ప్రాంతాల్లోని టీ దుకాణాలు, శివారు ప్రాంతాల్లోని హోటళ్లను కేంద్రంగా చేసుకుని బెట్టింగులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. గతంలో ఒంగోలు విద్యుత్‌ శాఖలో పనిచేసే ఉద్యోగి ఒకరు బెట్టింగులతో నష్టపోయి అప్పుల పాలై ఆత్మహత్య చేసుకుని మరణించిన ఘటనను ఈ సందర్భంగా కొందరు ఉద్యోగులు గుర్తుచేస్తున్నారు.

ఈ నెల 23న ఒంగోలు మీకోసంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తున్న మదన్‌కుమార్‌(ఫైల్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement