బాబు.. ఓ క్రెడిట్ చోరీ..
మార్కాపురం సభ సాక్షిగా వెలిగొండపై బాబు అబద్ధాలు జూలై నెలాఖరుకు ప్రాజెక్టును పూర్తిచేస్తా అంటూ ప్రకటన నిధులివ్వకుండా పనులు ఎలా పూర్తి చేసార్తంటూ అనుమానాలు ఆకట్టుకోని బాబు ప్రసంగం..
మార్కాపురం / మార్కాపురం టౌన్ / మార్కాపురం రూరల్ : వెలిగొండ ప్రాజెక్టుకు నేనే శంకుస్థాపన చేశా.. నేనే పూర్తి చేస్తా.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉమ్మడి జిల్లాలో ప్రతిసారీ చెప్పే అబద్ధాలే మళ్లీ ఘనంగా వళ్లించారు. 1996 మార్చి 5న మార్కాపురం మండలం గొట్టిపడియ వద్ద నాడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబునాయుడు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అయితే పైసా విదిల్చింది మాత్రం ఏమీ లేదు. ఈ ప్రాజెక్టుకు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాణం పోశారు. తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం అత్తెసర నిధులు విదిల్చారు. అవి కూడా ఆయన సొంతవారి జేబుల్లోకి వెళ్లిపోయాయన్న ఆరోపణలు ఉన్నాయి. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రాజెక్టు సొరంగ నిర్మాణ పనులను పరుగులు పెట్టించారు. కరోనా విపత్తుతో రెండేళ్లు పనులకు అంతరాలు ఏర్పడినా రెండు సొరంగాల పనులు పూర్తి చేశారు. పునరావాస కాలనీలు ఏర్పాటు చేసి రోడ్లు, వాటర్ ట్యాంకులు, ఇతర పనులు చేపట్టారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఉమ్మడి జిల్లా వాసులకు వాస్తవాలు తెలుసన్న విషయాన్ని మరిచిపోయిన చంద్రబాబు అండ్‌కో క్రెడిట్ చోరీకి పాల్పడుతోందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. మార్కాపురం సభలో చంద్రబాబు మాట్లాడుతూ ‘తానే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తానని, జూలైలో నీళ్లిస్తానని’ ప్రకటించడంపై ఈ ప్రాంతవాసులు ముక్కున వేలేసుకుంటున్నారు. ‘‘ఇప్పటివరకూ వెలిగొండ ప్రాజెక్టుకు మొత్తం రూ.5455 కోట్లు ఖర్చు అయిందని, ఇంకా రూ. 2540 కోట్లు ఖర్చుపెట్టాల్సి ఉంది’’ అంటూ చెప్పుకొచ్చారు. పునరావాస ప్యాకేజీ ప్రకటించకుండా, బడ్జెట్‌లో నిధులు కేటాయించకుండా జూలై నెలాఖరు లోగా ఎలా ప్రాజెక్టును ఎలా పూర్తిచేస్తారో? నీళ్లు ఎలా ఇస్తారో? ఆ దేవుడికే ఎరుక అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఏడాది జూలై నాటికి నల్లమల సాగర్ పూర్తి చేసి వెలిగొండ ప్రాజెక్టును కూడా పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి చేసిన ప్రకటనపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో కార్యాలయాల ఏర్పాటుకు కేవలం రూ. 50 ఇస్తున్నానని ప్రకటించారు. ముఖ్యంగా పలకల పరిశ్రమను ఆదుకోవాలని, మిర్చి యార్డు ఇవ్వాలని, మెడికల్ కాాలేజీని పూర్తిచేయాలని, మార్కాపురం చెరువును ట్యాంకు బండ్‌గా మార్చాలని, తర్లుపాడు రోడ్డును డబుల్‌రోడ్డుగా చేయాలని, మున్సిపాలిటీకి నిధులివ్వాలని, పొదిలి ప్రాంత ఆయకట్టును వెలిగొండలోకి చేర్చాలని నియోజకవర్గ వాసులు కోరుతున్నారు. వీటిపై ప్రభుత్వ పెద్దలు దృష్టి సారించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఊకదంపుడు ఉపన్యాసం..జనం నిరుత్సాహం..
చంద్రబాబు ఊకదంపుడు ఉపన్యాసంపై సభకు తీసుకొచ్చిన జనం సైతం నిరుత్సాహానికి గురయ్యారు. చెప్పినవే పదే పదే చెబుతుండడంతో తీవ్ర అసహనానికి లోనయ్యారు. మార్కాపురం జిల్లాకు ప్రత్యేకమైన వరాలు ఇవ్వకపోగా, తిరుపతి లడ్డూ, వైఎస్ వివేకానందరెడ్డి మరణం, తల్లి చెల్లి అంటూ చంద్రబాబు చెబుతున్న సమయంలో సభకు హాజరైన జనం పట్టించుకోకపోవడం గమనార్హం. ఆయన ప్రసంగం ప్రారంభించిన కొద్ది సమయానికే సభకు తీసుకొచ్చిన జనం బయటకు వెళ్లిపోవడం కనిపించింది.
మందు.. విందు.. కొట్లాటలు..
మార్కాపురం టౌన్ / మార్కాపురం రూరల్ / కొనకనమిట్ల / పొదిలి రూరల్ : జిల్లా ఏర్పడిన తరువాత తొలిసారిగా మార్కాపురానికి వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనను విజయవంతం చేసేందుకు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు పడిన తిప్పలు అన్నీ ఇన్నీ కావు. బాబు దృష్టిలో పడేందుకు చేసిన హడావుడికి తర్లుపాడు రోడ్డులో ట్రాఫిక్ జామ్ అయి ప్రజలు ఇబ్బంది పడ్డారు. సభకు జనాలను తరలించేందుకు పలు గ్రామాలకు లారీలు, ఆటోలు, బస్సులు, ఇతర వాహనాలను పెద్ద ఎత్తున కేటాయించారు. వాహనాల్లో సభకు వచ్చేవారికి మందు, విందు ఏర్పాటు చేశారు. అయితే కొందరు ఫూటుగా మద్యం సేవించి సభకు హాజరు కాకపోగా రోడ్లపై, చెట్లకింద దొర్లాడిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. మరికొన్ని ప్రాంతాల్లో మద్యం ఎక్కువై టీడీపీ కార్యకర్తలు కొట్టుకోవడం కూడా సోషల్‌మీడియాలో హల్‌చల్ చేసింది. ఆర్టీసీ బస్సుపై కూడా కూర్చుని ప్రమాదకర రీతిలో ప్రయాణం చేస్తున్నా అధికారులు పట్టీపట్టనట్టు వ్యవహరించారు. సభకు హాజరయ్యేందుకు వచ్చిన కొందరికి భోజనాలు కూడా అందకపోవడంతో తిట్టుకుంటూ వెనుదిరిగి వెళ్లిపోయారు.
బాబు.. ఓ క్రెడిట్ చోరీ..
బాబు.. ఓ క్రెడిట్ చోరీ..
బాబు.. ఓ క్రెడిట్ చోరీ..


