మోసం.. బాబు నైజం | - | Sakshi
Sakshi News home page

మోసం.. బాబు నైజం

Feb 26 2026 9:11 AM | Updated on Feb 26 2026 9:11 AM

మోసం.. బాబు నైజం

మోసం.. బాబు నైజం

హామీలు నెరవేర్చాలని అంగన్‌వాడీల రిలే దీక్షలు ప్రారంభం అంగన్‌వాడీలను నిలువునా మోసం చేశారని ఆగ్రహం

ఒంగోలు టౌన్‌: అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్‌వాడీల వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చిన చంద్రబాబు..రెండేళ్లవుతున్నా పట్టించుకోకుండా నిలువునా మోసం చేశాడని ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదర అన్నపూర్ణ విమర్శించారు. సమ్మె ఒప్పందాలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఇది ఎంత మాత్రం మంచిది కాదన్నారు. అంగన్‌వాడీల వేతనాలు పెంచాలని, ప్రీ స్కూళ్లను బలోపేతం చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు బుధవారం ప్రకాశం భవనం వద్ద రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు. ఒంగోలు, ఉలవపాడు, కందుకూరు ప్రాజెక్టుల నుంచి 15 మంది రిలే నిరాహార దీక్షల్లో పాల్గొన్నారు. సుమారు 200 మందికి పైగా అంగన్‌వాడీలు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ మాట్లాడుతూ నాటి ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. గుజరాత్‌ హైకోర్టు అంగన్‌వాడీ టీచర్‌కు రూ.24,800, ఆయాకు రూ.20,300 వేతనాలు ఇవ్వాలని తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. మన రాష్ట్రంలో ఆయాలకు అతి తక్కువగా కేవలం రూ.7 వేలు మాత్రమే వేతనాలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు పెంచని ప్రభుత్వం పనిభారాన్ని మాత్రం పెంచడం దారుమన్నారు. సుదీర్ఘ కాలం పనిచేసి రిటైర్డ్‌ అయిన తరువాత ఎలాంటి బెనిఫిట్స్‌ లేకుండా ఒట్టి చేతులతో ఇంటికి పంపించడం అమానవీయమన్నారు. మహిళల శ్రమకు తగిన ప్రతిఫలం ఇవ్వకుండా చేయడమే మహిళల ఉద్దరణా అని ప్రశ్నించారు. రోజు రోజుకీ ప్రీ స్కూల్‌ లక్ష్యాలను నిర్వీర్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్‌వాడీలకు వేతనాలు పెంచి బడ్జెట్‌లో తగిన నిధులను కేటాయించాలని డిమాండ్‌ చేశారు. శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్‌ పి.కల్పన మాట్లాడుతూ అంగన్‌వాడీలకు వేసవి సెలవులు ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. మే నెలంతా సెలవులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వేతనంతో కూడిన మెడికల్‌ లీవులు ఇవ్వాలని, పీఎఫ్‌, ఈఎస్‌ఐ అమలు చేయాలని కోరారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం రమేష్‌ మాట్లాడుతూ అంగన్‌వాడీలకు తగిన నిధులు కేటాయించకుండా కేంద్రంలోని మోదీ సర్కార్‌, రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం ఐసీడీఎస్‌ను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. ప్రీ స్కూలు నిధులను పెంచి అంగన్‌వాడీ పిల్లలకు తల్లికి వందనం అమలు చేయాలని కోరారు. అంగన్‌వాడీలను పర్మినెంట్‌ చేసేంత వరకు వేతనాలతో సంబంధం లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ నాయకులు ఇందిరావతి, బి.పద్మ, కె.హెమీమా, రాజేశ్వరి, లతారెడ్డి, స్వాతి, శ్రీదేవి, ఉషా, ముక్తార్‌, సుభాషిణి, జ్యోతి, మార్తమ్మ, జి.రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement