
300 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత
కనిగిరిరూరల్: పట్టణంలోని ఓ రేషన్ దుకాణం నుంచి టెంపో లారీలో అక్రమంగా తరలిస్తుండగా 300 బస్తాల రేషన్ బియ్యాన్ని ప్రజాసంఘాల నాయకులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే..పట్టణంలోని 15వ రేషన్ షాపు నుంచి బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో సీపీఎం, సీఐటీయూ, ప్రజా సంఘాల నాయకులు అడ్డుకోవడంతో అక్రమార్కులు లారీని వదిలేసి పరారయ్యారు. రేషన్ బియ్యం లారీలో ఉన్న 300 బస్తాల్లో సుమారు 136 బస్తాలు ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేసినవిగా గుర్తించారు. దీంతో ప్రజా సంఘాల నాయకులు రెవెన్యూ, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు ఫోన్ చేసిన సమాచారం ఇచ్చారు. దీంతో ఎన్‌ఫోర్సుమెంట్ డీటీ ఆర్ భూపతి, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ మనోహర్‌రెడ్డి, రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని బియ్యాన్ని పరిశీలించి సీజ్ చేశారు.
రేషన్ అక్రమార్కులను తప్పిస్తున్నారా..?
ఓ వైపు ప్రజా సంఘాల నాయకులు షాప్ నంబర్ 15 నుంచి లోడింగ్ చేస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నామని ఫొటోలు, వీడియోలు విడుదల చేశారు. కానీ ఎన్‌ఫోర్స్‌మెంట్, రెవెన్యూ అధికారులు మాత్రం పట్టుకున్నది రేషన్ బియ్యమేనని. అయితే ఆ బియ్యం బేస్తవారిపేటకు చెందిన మిల్లు, బియ్యం వ్యాపారి రమేష్‌వి అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. ఓనర్ రమేష్‌పై లారీ డ్రైవర్‌పై 6ఏ కేసులు నమోదు చేసి లారీని, బియ్యాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు. ఈమేరకు గోడోన్ అధికారులకు అప్పగించి జేసీ కోర్టులో హాజరుపరుస్తున్నట్లు చెప్పారు. రేషన్ షాపులో ఆన్‌లైన్ ప్రకారం అన్ని పరిశీలించామని ఎటువంటి తేడాలు లేవని చెప్పారు. మరీ 15వ నంబర్ నుంచి రేషన్ బియ్యాన్ని ఎత్తుతున్నట్లు వీడియోపై ప్రశ్నించగా..దీనిపై విచారిస్తున్నామని ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ ఆర్ భూపతి తెలిపారు. 15 నంబర్ డీలర్ అధికార పార్టీకి చెందిన నాయకుడు కావడంతో తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని, అలా చేస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి న్యాయ పోరాటం చేస్తామని సీఐటీయూ నాయకుడు కేశవరావు హెచ్చరించారు.
రేషన్ షాపులో అంతా బాగుందంటున్న
ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ
లారీ ఓనర్, డ్రైవర్‌పై 6ఏ కేసు నమోదు
లారీ, బియ్యం సీజ్