
మద్యానికి డబ్బులివ్వలేదని.. గొడ్డలితో భార్యపై దాడి
యర్రగొండపాలెం: మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని భార్యపై గొడ్డలితో దాడి చేసి గాయపరిచాడు. ఈ సంఘటన మండలంలోని వీరాయపాలెంలో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళితే..గ్రామానికి చెందిన రామయ్య మద్యం తాగేందుకు భార్య అంజమ్మను డబ్బులు అడిగాడు. తన వద్ద డబ్బులు లేవని చెప్పడంతో గొడవకు దిగాడు. ఇంట్లో ఉన్న గొడ్డలి తీసుకొని ఆమైపె దాడి చేశారు. ఈ సంఘటన చూసిన అంజమ్మ చెల్లెలు తిరుమల అనంతమ్మపై కూడా దాడి చేసి గాయపరిచినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిద్దరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సీహెచ్ ప్రభాకర్‌రావు తెలిపారు.
ఒంగోలు సిటీ: జిల్లాలో ఏఓలుగా పనిచేస్తున్న 9 మంది, గుంటూరు జిల్లాలో ఏఓగా పనిచేస్తున్న ఒకరు ఎంపీడీఓలుగా పదోన్నతి పొందినట్లు జెడ్పీ సీఈఓ చిరంజీవి ఒక ప్రకటనలో తెలిపారు. కె. ఖయిమ్‌పీరా, కె.సీతారామారావు, డి.అబ్ధుల్ ఖాదర్, ఎస్.సత్యమ్, జీవీ కృష్ణారావు, ఎస్.జాన్‌సుదరం, వి.ప్రతాప్‌రెడ్డిలను ప్రకాశం జిల్లాకు, కె.ధనలక్ష్మిని బాపట్ల జిల్లాకు, డీవీ రమణారెడ్డి, వై.శంకరరావులను శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు కేటాయించినట్లు చెప్పారు.
కొత్తపట్నం: ఇంటి రుణం కోసం తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే..మండలంలోని అల్లూరు గ్రామానికి చెందిన మేడికొండ అంకయ్య ఇంటి రుణం కోసం మధ్యవర్తి రఫీ అనే వ్యక్తిని సంప్రదించాడు. వీరిద్దరూ వెళ్లి ఒంగోలు 60 అడుగుల రోడ్డులో ఓ ప్రైవేట్ ఫైనాన్సీ కంపెనీని వెళ్లారు. అక్కడ కంపెనీ ప్రతినిధులు ఏఏ డాక్యుమెంట్లు కావాలో చెప్పి పంపించారు. ఈ క్రమంలో అంకయ్య సదరు డాక్యుమెంట్ల కోసం బాష అనే వ్యక్తిని సంప్రదించగా..బాష కొత్తపట్నం తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి డాక్యుమెంట్ తయారు చేసి ఇచ్చాడు. ఈ క్రమంలో ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులు డాక్యుమెంట్లు పరిశీలిస్తుండగా..కొత్తపట్నం తహసీల్దార్ సంతకం ఉన్న డాక్యుమెంట్ ఉన్న అనుమానం వచ్చి నేరుగా తహసీల్దార్ శాంతిని కలిశారు. అయితే ఆ డాక్యుమెంట్ చూసిన తహసీల్దార్ శాంతి..అది తన సంతకం కాదని, ఫోర్జరీ చేశారని చెప్పారు. వెంటనే తహసీల్దార్ ఎస్సైకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ డాక్యుమెంట్లు గత నెలలో తయారు చేసినట్లు తెలిసింది. దీనిపై గత రెండు రోజులుగా తహసీల్దార్ కార్యాలయంలో విచారణ చేస్తున్నారు.

మద్యానికి డబ్బులివ్వలేదని.. గొడ్డలితో భార్యపై దాడి