
ఎరువుల కొరత సృష్టించింది చంద్రబాబే
రైతులకు సరిపడా యూరియా లేకుండా చేసిన కూటమి ప్రభుత్వం ఎరువుల కొరతపై 9వ తేదీ ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడం దుర్మార్గం ఆరోగ్య శ్రీని తూట్లు పొడిచేందుకు కుట్రలు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి
ఒంగోలు టౌన్: కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే రాష్ట్రంలో యూరియా కొరత సృష్టించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి ఆరోపించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఏడాది 39.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను ఉపయోగించారని, అయితే ఈ ఏడాది ఉద్దేశపూర్వకంగానే కేవలం 322 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే తెప్పించారని వివరించారు. రైతులకు అవసరమైన 7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను రాష్ట్రానికి అవసరం లేదని కేంద్రానికి నివేదిక ఇచ్చారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువులు దొరక్క నానా అగచాట్లు పడుతుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదన్నారు. నల్లబజారులో ఎరువులు విక్రయిస్తున్నారని, వారి వద్ద ఎరువులు ఎక్కడి నుంచి వచ్చాయో పాలకులు చెప్పాలని ప్రశ్నించారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అవసరమైనంత మేర ఎరువులను తెప్పించి అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. ఎరువుల సమస్యపై ఈ నెల 9వ తేదీ ఆర్డీఓ కార్యాలయం వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతు నాయకులతో వినతి పత్రం అందిస్తామని చెప్పారు. కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
వైద్య విద్య ప్రైవేటుపరం చేయడం దారుణం:
ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో 10 మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌పరం చేయనున్నట్లు నిర్ణయం తీసుకోవడంపై బూచేపల్లి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జగనన్న హయాంలో దాదాపుగా పూర్తయిన మెడికల్ కాలేజీలను కుట్రపూరితంగా పక్కన పెట్టేశారని ధ్వజమెత్తారు. ఇప్పుడు పీపీపీ ద్వారా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు పన్నాగాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు కళాశాలల్లో భారీగా ఫీజులు కట్టి చదివే స్థోమత లేని నిరుపేద విద్యార్థులకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల అవసరం ఉందన్నారు. సామాన్య ప్రజలకు వైద్యం, నిరుపేద విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులో లేకుండా చేయడానికి కూటమి పాలకులు ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైద్యశాలలను, వైద్య కళాశాలలను నిర్వహించగలిగే స్థితిలో పాలకులు లేరన్నారు. ఇలాంటి ప్రభుత్వం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటేనని స్పష్టం చేశారు. ఆరోగ్య శ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం దొడ్డిదారి ప్రయత్నాలు చేస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే ఆరోగ్య శ్రీ ఆస్పత్రులకు రూ.3 వేల కోట్ల బకాయిలు ఉన్నారని చెప్పారు. ఆరోగ్య శ్రీ ట్రస్ట్‌ను రద్దు చేసి బీమా కిందకు తీసుకొస్తున్నారని, ఒకవేళ ప్రభుత్వం బీమా కంపెనీలకు సకాలంలో నిధులు విడుదల చేయకపోతే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో ఆయుష్మాన్ భారత్ ద్వారా వైద్య సేవలు అందిస్తోందని, ఇప్పుడు దానితో కలిపేసి ఆరోగ్యశ్రీని అమలు చేస్తున్నారని చెప్పారు. ఆరోగ్యశ్రీని ఎత్తివేసే కుట్రలు మానుకొని రాష్ట్రంలోని నిరుపేద ప్రజలకు ఉచిత వైద్య సేవలను అందించాలని డిమాండ్ చేశారు.
దోపిడీదారుల ప్రయోజనాలే చంద్రబాబుకు ముఖ్యం:
చంద్రబాబుకు రాష్ట్ర ప్రజల, రైతుల సంక్షేమం పట్టడం లేదని, కేవలం దోపిడీదారుల ప్రయోజనాలే ముఖ్యమని ఒంగోలు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఒక వ్యూహం ప్రకారమే ఎరువుల కొరత సృష్టిస్తున్నారని తెలిపారు. ఎరువులు సరిపడా అందుబాటులో ఉంటే రైతులు వరి పండిస్తారని, అప్పుడు ప్రభుత్వం వరి కొనాల్సి వస్తుందని, ఇది ఇష్టం లేకనే ఎరువులను లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. పొగాకుకు డిమాండ్ ఉన్నా కంపెనీలతో కుమ్మకై ్కన ప్రభుత్వం గిట్టుబాటు లేకుండా చేసిందని, తాజాగా కృత్రిమంగా ఎరువుల కొరత సృష్టించి రైతులను నిలువుగా దోచుకునేందుకు ప్లాన్ చేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, పార్టీ జిల్లా పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, నగర అధ్యక్షుడు కఠారి శంకర్, లిగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, పీడీసీసీ మాజీ చైర్మన్ వైఎం ప్రసాద్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు కేవీ రమణా రెడ్డి, వై.వెంకటేశ్వర్లు, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమిరెడ్డి రమణమ్మ, పంచాయతీరాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముల్లంగి రవీంద్రా రెడ్డి, ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి రొండా అంజిరెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు బంగారుబాబు, జిల్లా నాయకులు దేవరపల్లి అంజిరెడ్డి, దాసరి కరుణాకర్, మన్నెం శ్రీధర్ బాబు, షేక్ మీరావలి, టి.మాధవి, వడ్లమూడి వాణి, గోనెల మేరి, బత్తుల ప్రమీల, దేవా, కిరీటి, పెట్లూరి ప్రసాద్, గౌతం కూనం, నాటారు జనార్ధన రెడ్డి, పిగిలి శ్రీనివాసరావు, ఆనం శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, పక్కన వెంకాయమ్మ, బత్తుల, చుండూరి రవిబాబు తదితరులు