
సమాజానికి దిశానిర్దేశం చేసేది గురువులే
జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్న గురువులు
ఒంగోలు సబర్బన్: సమాజానికి దిశా నిర్దేశం చేసేది గురువులేనని జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ అన్నారు. విద్యార్థులను ఉన్నత వ్యక్తిత్వం కలిగిన పౌరులుగా తీర్చిదిద్దే గురుతర బాధ్యత వారిపై ఉందన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ప్రకాశం భవనంలోని గ్రీవెన్స్ హాలులో జిల్లా విద్యాధికారి ఏ.కిరణ్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా స్థాయి గురుపూజోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలవేసి వారు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఉన్నత విలువలు కలిగిన భావిపౌరులను తయారు చేసేది ఉపాధ్యాయులేనని అన్నారు. మంచి బోధనపై ఉపాధ్యాయులు మరింత దృష్టి సారించాలని సూచించారు. డీఆర్‌ఓ బీసీహెచ్ ఓబులేసు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల ఉన్నతి ఉపాధ్యాయుల చేతుల్లో ఉంటుందన్నారు. ఉత్తమ సేవలు అందించిన 53 మంది ఉపాధ్యాయులను అతిథులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో విద్యార్థులు నిర్వహించిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఇతర అతిథులుగా పాల్గొన్న సంతనూతలపాడు ఎమ్మెల్యే బి.ఎన్.విజయ్ కుమార్, రాష్ట్ర మారీటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ, ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, డీఆర్‌ఓ ఓబులేసుతో కలిసి తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

సమాజానికి దిశానిర్దేశం చేసేది గురువులే