
ఎవరికి పట్టేను ఈ వేదన.. ఏ గుండెను తాకేను ఈ రోదన..
మార్కాపురం: విధి ఆడిన నాటకంలో ఆ అమ్మాయి అనాథగా మారింది. నా అనేవారు లేక ఒంటరిగా ఉంటూ మనోధైర్యంతో పాఠశాలకు వెళ్తూ పదో తరగతి చదువుతోంది. తలిదండ్రులు, అమ్మమ్మ, నాయనమ్మ, ఇలా ఒకరు తరువాత ఒకరు ఆ అమ్మాయిని వదిలి వెళ్లిపోవడంతో ఒంటరైంది. అయినా పట్టుదలతో పాఠశాలకు వెళ్తూ చదువుకుంటోంది. ప్రస్తుతం పెదనాన్న సంరక్షణలో ఉన్న ఆ అమ్మాయి దీనగాథ. మార్కాపురం మండలంలోని పెద్దనాగులవరం గ్రామానికి చెందిన కాటంరాజు, సావిత్రిల కుమార్తె లక్ష్మిలలిత. సరిగ్గా 6 ఏళ్ల క్రితం కూలీపనులకు వెళ్లే నిమిత్తం తండ్రి కాటంరాజు ఇంటి నుంచి బయలుదేరాడు. అయితే గుండ్లకమ్మపై వరద ఉధృతంగా ప్రవహిస్తున్నా చిన్నప్పటి నుంచి అలవాటైన వాగే కదా అని ధైర్యంగా దిగి నడుస్తుండగా వరద ఉధృతి పెరిగి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. తండ్రిని కోల్పోయిన లలిత తల్లి ఉందనే ధైర్యంతో పాఠశాలకు వెళ్లేది. భర్త పోయిన మనోవేదన, అనారోగ్యంతో సావిత్రి కూడా నాలుగేళ్ల క్రితం చనిపోవడంతో లక్ష్మిలలిత అనాథగా మారింది. చిన్న వయసులోనే అనాథగా మారానని బాధపడింది. అదే సమయంలో అమ్మమ్మ నరసమ్మ చేరదీసి ఆలనాపాలనా చూసింది. సవ్యంగా జీవితం సాగిపోతుందనుకున్న సమయంలో మూడేళ్ల క్రితం ఆమె కూడా కాలం చేయడంతో లక్ష్మీ లలిత జీవితం మొదటికొచ్చింది. నాయనమ్మ అల్లూరమ్మ మళ్లీ దగ్గరకు తీసుకుని మనవరాలిని ఆలనా పాలనా చూస్తూ పాఠశాలకు పంపేది. మళ్లీ దేవుడు ఆ కుటుంబంపై పగ పట్టినట్టుగా అనారోగ్యంతో అల్లూరమ్మ కూడా మృతి చెందింది. దీంతో లలిత మళ్లీ ఒంటరైంది. అమ్మా నాన్న లేకపోవడంతో ప్రభుత్వం ఇచ్చే తల్లికి వందనం కూడా రాలేదు. ప్రస్తుతం పెదనాన్న ఆంజనేయులు సంరక్షణలో ఉంటోంది. ప్రతి రోజు ఇంటిపనులు చేసుకుని ఇల్లు చక్కదిద్దుకుని గ్రామంలో ఉన్న పాఠశాలకు వెళ్లి పదో తరగతి చదువుతోంది. తన పెదనాన్న కూడా ప్రతిరోజూ కూలీ పనికి వెళ్తున్నాడని, ఇబ్బందులు పడుతూనే చదివిస్తున్నాడని చెప్పింది. దాతలు ఎవరైనా స్పందించి తనకు ఆర్థిక సాయం అందించాలని లక్ష్మిలలిత చేతులు జోడించి ప్రార్థించింది. తనకు సాయం చేయాలనుకునేవారు పెదనాన్న ఆంజనేయులును సంప్రదించాలని విజ్ఞప్తి చేసింది.
తల్లిదండ్రులు లేక సాయం కోసం బాలిక ఎదురుచూపులు

ఎవరికి పట్టేను ఈ వేదన.. ఏ గుండెను తాకేను ఈ రోదన..