
ఫెన్సింగ్ క్రీడాకారుల ఎంపిక
ఒంగోలు: జాతీయ స్థాయిలో అండర్–17 విభాగంలో జరగనున్న ఫెన్సింగ్ పోటీలకు జిల్లా నుంచి ఎంపికై న క్రీడాకారుల జాబితాను ప్రకాశం జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి జి.నవీన్ గురువారం ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. పుత్తూరి చక్రిక (చీమకుర్తి–సాబర్ విభాగం బ్రాంజ్), పూసపాటి లిఖితారెడ్డి (చెరువుకొమ్ముపాలెం–ఈపీ విభాగం–బ్రాంజ్) ఎంపికై నట్లు తెలిపారు. వీరు ఈ నెల 8 నుంచి 13వ తేదీ వరకు ఉత్తరాఖండ్ రాష్ట్రం హల్వానీ పట్టణంలోని ఇందిరాగాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో నిర్వహించనున్న 20వ క్యాడెట్ అండర్–17 జాతీయ స్థాయి ఫెన్సింగ్ పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఇటీవల పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో వీరు సత్తాచాటి జాతీయ స్థాయి పోటీలకు జిల్లా నుంచి ఎంపికయ్యారని వివరించారు. క్రీడాకారులిద్దరితో పాటు వారికి శిక్షణ ఇచ్చిన కోచ్ రాజును ఫెన్సింగ్ జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు, ఫెన్సింగ్ రాష్ట్ర అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు వి.నాగేశ్వరరావు అభినందించారు.
ఒంగోలు సిటీ: ఆంధ్రకేసరి యూనివర్సిటీ పరిధిలోని బి.ఎడ్ కళాశాలల్లో 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి నాలుగో సెమిస్టర్ పరీక్షల ఫలితాలను యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ డీవీఆర్ మూర్తి గురువారం సాయంత్రం విడుదల చేశారు. ఈ పరీక్షలకు మొత్తం 10,936 మంది విద్యార్థులు నమోదు కాగా, వారిలో 95.38 ఉత్తీర్ణత శాతంతో 10,431 మంది విద్యార్థులు పాసైనట్లు యూనివర్సిటీ సీఈ ప్రొఫెసర్ సోమశేఖర్ తెలిపారు. యూనివర్సిటీ స్థాయిలో, ఆయా కళాశాలల స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను వీసీ మూర్తి, రిజిస్ట్రార్ హరిబాబు, సీఈ సోమశేఖర్, తదితరులు అభినందించారు. ఫలితాల విడుదల కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్.నిర్మలామణి, ఓఎస్డీ ప్రొఫెసర్ రాజమోహన్‌రావు, ఏసీఈ డాక్టర్ ఏ భారతీదేవి, పీజీ కో ఆర్డినేటర్ (నాన్ కాన్ఫిడెన్షియల్) డాక్టర్ ఆర్.శ్రీనివాస్, పరీక్షల విభాగం పర్యవేక్షకుడు సూడా శివరామ్, సిబ్బంది పాల్గొన్నారు.
ఒంగోలు వన్‌టౌన్: మహిళలకు టైలరింగ్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఒంగోలు రూడ్‌సెట్ సంస్థ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని గ్రామీణ ప్రాంత మహిళలకు ఈ నెల 15 నుంచి 30 రోజుల పాటు ఉచిత శిక్షణ ఉంటుందన్నారు. అభ్యర్థుల వయసు 19 నుంచి 45 సంవత్సరాల్లోపు ఉండాలన్నారు. మహిళలు తమ పూర్తి వివరాలతో కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి కల్పించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు 9573363141 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
చీమకుర్తి: స్థానిక యూటీఎఫ్ భవన్‌లో ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు ప్రజానాట్యమండలి జిల్లా స్థాయి శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నట్లు ఆ సంఘ జిల్లా కార్యదర్శి పొత్తూరి సురేష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. టీవీ, సినిమాల విష సంస్కృతికి వ్యతిరేకంగా సాంస్కృతికోద్యమ నిర్మాణానికి వినూత్నంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సాంస్కృతిక మేళాలు, వీధి నాటకాలు, జానపద ఉత్సవాలు, భవిత కోసం బాలోత్సవం, కోలాటం, చెక్కభజన దళాల ఏర్పాటు, నెలనెలా ఓ పూట ఓ పాట నేర్చుకుందాం అనే కార్యక్రమాలతో పాటు కవితా గోష్టులు, డప్పుల దరువులు వంటి కళలపై మూడు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. జిల్లాలోని ప్రజాకళాకారులంతా పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సురేష్ కోరారు.

ఫెన్సింగ్ క్రీడాకారుల ఎంపిక