
దోపిడీ సహజంగా!
కొండపి నియోజకవర్గంలో ఇష్టారాజ్యంగా సహజ వనరుల తవ్వకాలు సింగరాయకొండ, టంగుటూరు మండలాల్లో గ్రావెల్ దందా రోజూ లక్షలాది రూపాయల విలువైన గ్రావెల్ అక్రమ రవాణా జరుగుమల్లి, పొన్నలూరు, సింగరాయకొండ మండలాల్లో ఇసుక దందా చెరువులనూ వదలని అక్రమార్కులు రెవెన్యూ, మైనింగ్ పోలీస్ శాఖలు పట్టించుకోని వైనం అధికారులకు భారీగా ముడుపులు ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే అక్రమ మైనింగ్
కొండపి నియోజకవర్గంలో సహజ సంపదను అధికార పార్టీ నేతలు కొల్లగొట్టేస్తున్నారు. కొండలు, గుట్టలు, వాగులు, వంకలు, చెరువుల్లో ఇసుక, మట్టిని ఎడాపెడా తవ్వేస్తున్నారు. భారీ యంత్రాలతో తోడేస్తున్నారు. నదీగర్భాలకు తూట్లు పొడుస్తున్నారు. కొండలు, గుట్టల స్వరూపాలే మారిపోతున్నాయి. పచ్చపార్టీ నేతల అండదండలతో పగలూ, రాత్రి అన్న తేడా లేకుండా దోపిడీ సాగుతోంది. అడ్డగోలుగా రూ.కోట్లు విలువజేసే సంపదను దోచేస్తున్నా సంబంధిత అధికారులకు మాత్రం కనిపించడం లేదు. తమ జేబులు నిండుతుండడంతో అక్రమార్కులపై చర్యలు తీసుకోవడంలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
తవ్వకాలు జోరుగా..
సాక్షి టాస్క్‌ఫోర్స్:
కొండపి నియోజకవర్గంలో పచ్చ తమ్ముళ్ల ఇసుక, గ్రావెల్ దందా జోరుగా సాగుతోంది. ప్రధానంగా జరుగుమల్లి, పొన్నలూరు మండలాల పరిధిలోని పాలేరు నదిలో, సింగరాయకొండలోని మన్నేరులో ఇసుక అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ప్రతిరోజు వెయ్యికి పైగా ట్రాక్టర్లు, 50 కిపైగా టిప్పర్లలో ఇసుక తరలిస్తూ కోట్లాది రూపాయల సహజ సంపదను కొల్లగొడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా యంత్రాలతో అక్రమ తవ్వకాలు చేస్తుండడంతో పాలేరులో భారీ గుంతలు ఏర్పడి నది రూపురేఖలే మారిపోయాయి. అక్రమ రవాణా కారణంగా భారీగా వాహనాలు తిరుగుతుండడంతో పొలాలకు వెళ్లే రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. నియోజకవర్గ పెద్దల సహకారంతో అక్రమ దందా నడుస్తుండటంతో మైనింగ్, పోలీసు, రెవెన్యూ అధికారులు అక్రమాలను చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. సామాన్యుడు రీచ్‌లోకెళ్లి ఇసుక తెచ్చుకోవాలంటే పచ్చ తమ్ముళ్ల అనుమతి తప్పనిసరి. వీరు ట్రాక్టరు లోడింగ్‌కు ప్రాంతాన్ని బట్టి రూ.500 నుంచి రూ.1000 వసూలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. మట్టి దందా సింగరాయకొండ మండలంలో శానంపూడి, పాతసింగరాయకొండ, సోమరాజుపల్లి, టంగుటూరు మండలంలో యరజర్ల, కొణిజేడు, మర్లపాడు, కందులూరు, సర్వేరెడ్డిపాలెం, వల్లూరు ప్రాంతాల్లో జోరుగా సాగుతోంది. సింగరాయకొండ మండల పరిధిలో గతంలో ప్రతిరోజు సుమారు రూ.10 లక్షల వరకు గ్రావెల్ దందా జరగగా, ప్రస్తుతం సుమారు రూ.2 లక్షల వరకు, టంగుటూరు మండల పరిధిలో సుమారు రూ.15 లక్షల వరకు జరుగుతోందన్న ఆరోపణలున్నాయి.

దోపిడీ సహజంగా!