
పోలీసుల అదుపులో హత్య కేసు నిందితుడు?
బేస్తవారిపేట: వైఎస్సార్ సీపీ కార్యకర్త గాలి బ్రహ్మయ్యను కత్తులతో పొడిచి పెట్రోల్ పోసి నిప్పంటించి అతి దారుణంగా హత్య చేసిన కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కంభం మండలం దరగకు చెందిన బ్రహ్మయ్యను బుధవారం రాత్రి మద్యం పార్టీకి పిలిచి హత్య చేయగా, గురువారం ఉదయం వెలుగులోకి వచ్చిన విషయం విధితమే. ఈ కేసులో బ్రహ్మయ్యతో కలిసి మద్యం తాగిన ఇద్దరితో పాటు అనుమానంతో మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు మార్కాపురం డీఎస్పీ యు.నాగరాజు విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. వీరిలో ఇద్దరిని గురువారం సాయంత్రం విడిచిపెట్టగా, ఒకరు పోలీసుల అదుపులోనే ఉన్నారు. మృతుడు బ్రహ్మయ్య యువకుడు, శారీరకంగా బలమైన వ్యక్తి. అతన్ని హత్య చేయాలంటే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి చేసి ఉంటారని గ్రామస్తులు అంటున్నారు. మృతుడితో రాత్రిపూట కలిసి ఉన్న వ్యక్తి, జేబీకే పురానికి చెందిన మరొకరితో కలిసి హత్య చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. పోలీసులు ఫోరెన్సిక్, క్లూస్ టీమ్, పోలీస్ జాగిలం, సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.
మృతుడి తల్లి
ఆక్రందన వర్ణణాతీతం..
గాలి వీరభద్రుడు, రమణమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉండగా, కుమారుడు బ్రహ్మయ్య అంటే తల్లికి ప్రాణం. ఏడేళ్ల క్రితం భర్త మరణించగా, కుమారుడే కుటుంబానికి అండగా నిలబడతాడని ఎన్నో ఆశలు పెట్టుకుని జీవిస్తోంది. చేతికందివచ్చిన కొడుకు మరణంతో గురువారం ఉదయం నుంచి దిక్కులు పిక్కటిల్లేలా ఆమె రోదిస్తోంది. ఇక నాకు దిక్కెవరంటూ కుమిలికుమిలి ఏడుస్తోంది. ఆ తల్లికి సర్దిచెప్పడం ఎవరి వల్లా కావడం లేదు. ఆ తల్లి బాధను చూసి గ్రామస్తులు సైతం కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

పోలీసుల అదుపులో హత్య కేసు నిందితుడు?