
రూ.1.05 లక్షలు పలికిన గణేష్ లడ్డూ
చీమకుర్తి: చీమకుర్తిలోని శ్రీకృష్ణుడి వద్ద వినాయకుడి విగ్రహం చేతిలో ఉంచిన లడ్డూకు శుక్రవారం వేలంపాట నిర్వహించగా రూ.1.05 లక్షలు పలికింది. నిమజ్జనం సందర్భంగా నిర్వహించిన వేలంలో బత్తుల వెంకటేశ్వర్లు వినాయకుడి చేతిలో ఉంచిన లడ్డూను రూ.1.05 లక్షలకు దక్కించుకోగా, కలశం లడ్డూను మురళీధర్ రూ.20 వేలకు పాడుకున్నారు. ఆయా లడ్డూలను భక్తులతో కలిసి ఊరేగింపుగా ఇళ్లకు తీసుకెళ్లారు.
సింగరాయకొండ: స్థానిక ఏఆర్‌సీ అండ్ జీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలో శుక్రవారం జిల్లా టెన్నికాయిట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పురుషులు, మహిళల జిల్లా జట్లను ఎంపిక చేశారు. వీరు ఈ నెల 13, 14 తేదీల్లో కోససీమ జిల్లా మండపేటలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని జిల్లా అసోసియేషన్ సెక్రటరీ ఎన్‌టీ ప్రసాద్ తెలిపారు. ట్రెజరర్ శంకర్రావు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
సింగరాయకొండ: అర్ధరాత్రి ఇంట్లో పడుకుని ఉన్న తన్నీరు ప్రతాప్ అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తి కిటికీలో నుంచి పెట్రోల్ పోసి తగలబెట్టేందుకు ప్రయత్నించాడు. ఈ సంఘటన శుక్రవారం తెల్లవారుజామున సింగరాయకొండ మండలంలోని కనుమళ్ల పంచాయతీ చిన్న కనుమళ్ల గ్రామం వడ్డెపాలెంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కొంతకాలంగా ప్రతాప్, అతని భార్యకు మనస్పర్థలు ఉండటంతో ఆమె పుట్టింట్లో ఉంటోంది. ఇటీవల ప్రతాప్ తల్లి చనిపోవడంతో భార్యాభర్తలిద్దరూ కలిసి ఉంటున్నారు. రోజూలాగే ప్రతాప్ కింద పడుకోగా, ఇద్దరు పిల్లలతో భార్య మంచంపై పడుకుని ఉంది. రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ప్రతాప్‌పై కిటికీలో నుంచి పెట్రోలు పోసి నిప్పుపెట్టాడు. దీంతో ప్రతాప్ కాళ్లు, చేతులు, మొహానికి స్వల్పంగా గాయాలయ్యాయి. అతను కందుకూరు ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కొమరోలు: మండలంలోని పలు గ్రామాల్లో ఓ పిచ్చికుక్క స్వైర విహారం చేసి 20 మందిని కరిచి గాయపరిచింది. కొమరోలు, గోపాలునిపల్లె, సూరవారిపల్లె గ్రామాల్లో గురువారం రాత్రి నుంచి పిచ్చికుక్క తిరుగుతూ కనిపించిన వారందరిపై దాడి చేసింది. దీంతో 20 మంది గాయపడి కొమరోలు ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి చికిత్స పొందారు. మండలంలో అధిక సంఖ్యలో కుక్కలు ఉండటం, ప్రజలను కరుస్తుండటంతో భయాందోళనకు గురవుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి కుక్కలను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

రూ.1.05 లక్షలు పలికిన గణేష్ లడ్డూ

రూ.1.05 లక్షలు పలికిన గణేష్ లడ్డూ