శ్రీశైలం ఘాట్‌ రోడ్డులో ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

శ్రీశైలం ఘాట్‌ రోడ్డులో ప్రమాదం

Sep 6 2025 4:29 AM | Updated on Sep 6 2025 4:29 AM

శ్రీశైలం ఘాట్‌ రోడ్డులో ప్రమాదం

శ్రీశైలం ఘాట్‌ రోడ్డులో ప్రమాదం

శ్రీశైలం ఘాట్‌ రోడ్డులో ప్రమాదం విద్యుత్‌ తీగ చోరీ కేసులో నిందితుల అరెస్ట్‌ 18న తపాలా ఏజెంట్ల ఎంపికకు ఇంటర్వ్యూలు 7న అట్రాసిటీ బాధితులకు న్యాయ సలహాలు

అదుపుతప్పి బోల్తాపడిన టెంపో

ట్రావెలర్‌ వాహనం

పలువురికి స్వల్ప గాయాలు

పెద్దదోర్నాల: శ్రీశైలం ఘాట్‌రోడ్డులోని చింతల గిరిజనగూడెం సమీపంలో ఓ టెంపో ట్రావెలర్‌ వాహనం అదుపుతప్పి బోల్తాపడటంతో అందులో ప్రయాణిస్తున్న పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. శుక్రవారం దోర్నాల నుంచి శ్రీశైలం వైపునకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అందులో ప్రయాణిస్తున్న పలువురు స్వల్పంగా గాయపడటంతో శ్రీశైలం ప్రాజెక్టు కాలనీలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

రూ.3.90 లక్షల విలువైన సొత్తు రికవరీ

దర్శి: విద్యుత్‌ తీగ చోరీ కేసులో ముగ్గురు నిందితులు, ఇద్దరు జువైనెల్‌లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.3.90 లక్షల విలువైన 11 కేవీ విద్యుత్‌ వైరు (7.7 కి.మీ) రికవరీ చేశారు. వారి వద్ద ఉన్న కారు, కట్టర్లను సీజ్‌ చేశారు. దర్శి సీఐ రామారావు తెలిపిన వివరాల ప్రకారం.. గత ఆగస్టు 29వ తేదీ చందలూరు పంచాయతీ సమీపంలోని ఇండస్ట్రియల్‌ పార్క్‌ వద్ద గుర్తు తెలియని దొంగలు 11 కేవీ విద్యుత్‌ వైరును చోరీ చేశారు. విద్యుత్‌ రూరల్‌ ఏఈ బండారు వేణుగోపాల్‌ ఫిర్యాదు మేరకు దర్శి ఎస్‌ఐ మురళీ కేసు నమోదు చేశారు. టెక్నాలజీ సాయంతో నిందితులను గుర్తించి గురువారం అరెస్టు చేశారు. ఈ నెల 3వ తేదీ మధ్యాహ్నం 4.30 గంటలకు దర్శి పట్టణంలో కాలువ వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పల్నాడు జిల్లా శ్రీరుక్మిణీపురంకు చెందిన ఫలితే హనుమనాయక్‌, ఫలితే చందర్‌ నాయక్‌, బట్టుల మహేష్‌, మరో ఇద్దరు మైనర్‌ బాలురను అదుపులోకి తీసుకున్నారు. కోర్డులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్‌ విధించారు.

ఒంగోలు వన్‌టౌన్‌: భారత ప్రభుత్వ తపాలా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తపాలా జీవిత బీమా, గ్రామీణ తపాలా జీవిత బీమా పాలసీలు సేకరించేందుకు ఏజెంట్లను ఎంపిక చేసేందుకు ఈ నెల 18వ తేదీ ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోస్టల్‌ ఎండీ జాఫర్‌ సాధిక్‌ శుక్రవారం రఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న ఏజెంట్లకు పాలసీలను బట్టి ఆకర్షణీయమైన కమీషన్‌ చెల్లించడం జరుగుతుందన్నారు. అభ్యర్థులు కనీసం 10వ తరగతి పాసై ఉండాలని, 18 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలని సూచించారు. ప్రాంతీయంగా పరిచయాలు ఉండి ఇన్సూరెన్సు రంగంలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌ సర్టిఫికెట్లు, 2 పాస్‌పోర్టు సైజు ఫొటోలు, ఆధార్‌ కార్డుతో ప్రకాశం సీనియర్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయం, భాగ్యనగర్‌ 2వ లైన్‌, ఒంగోలు చిరునామాలో ఇంటర్వ్యూలకు హాజరుకావాలని సూచించారు. ఎంపికై న అభ్యర్థులు రూ.5 వేల సెక్యూరిటీ డిపాజిట్‌ చేయాలని తెలిపారు.

ఒంగోలు టౌన్‌: సకాలంలో న్యాయం జరగక ఇబ్బందులు పడుతున్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లోని బాధితులకు ఈ నెల 7వ తేదీ స్థానిక ఎల్బీజీ భవనంలో న్యాయవాదులతో న్యాయసలహాలు ఇవ్వనున్నట్లు కేవీపీఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బీవీ రఘురాం, జిల్లా ఉపాధ్యక్షులు అట్లూరి రాఘవులు, వి.మోజేస్‌ తెలిపారు. శుక్రవారం స్థానిక ఎల్బీజీ భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఇటీవల రాష్ట్రంలో దళితులు, గిరిజనులపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయని చెప్పారు. దళిత గిరిజనుల మీద అత్యంత క్రూరంగా దాడులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. నిందితులకు 41 సీఆర్‌పీ పేరుతో స్టేషన్‌ బెయిలిచ్చి పంపిస్తున్నారని, మరికొన్ని కేసులలో నేరుగా పోలీసులే ముద్దాయిలుగా ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోందని అన్నారు. దళితుల హత్యలు జరిగినప్పుడు నిబంధనల ప్రకారం రెవెన్యూ శాఖకు సమాచారం ఇవ్వకుండా పంచనామాలు నిర్వహించి సంతకాలు చేయిస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదైన తర్వాత బాధితులకు చట్టాలపై అవగాహన లేకపోవడంతో అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే బాధితులకు చట్టాలపై అవగాహన కల్పించడం కోసం న్యాయవాదులతో విచారణ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనికి ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు, బాపట్ల, తిరుపతి జిల్లాల నుంచి బాధిత దళితులు హాజరవుతారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదై న్యాయం కోసం తిరుగుతున్న బాధితులు ఈ న్యాయ సలహాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement