
కందిపప్పు.. ఏది చెప్పు..!
మార్కాపురం: కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ షాపుల ద్వారా బియ్యం మినహా అదనపు సరుకులు ఇవ్వకపోతుండటంతో లబ్ధిదారులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. గత 7 నెలల నుంచి కందిపప్పు సరఫరా నిలిచిపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఎండీయూ వాహనాల ద్వారా ఇంటింటికీ వచ్చి నిత్యావసర సరుకులు అందించగా కూటమి ప్రభుత్వంలో లబ్ధిదారులు షాపుల వద్దకు వెళ్లి పడిగాపులు కాసినా బియ్యం, చక్కెర తప్ప ఏమీ ఉండకపోతుండటంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
దసరాకు కూడా పప్పన్నం లేనట్లే..!
ఈ నెలలోనే దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 2వ తేదీ విజయదశమి పండుగ జరుగనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రేషన్ సరుకుల్లో బియ్యంతో పాటు కందిపప్పు, తదితర సరుకులేమైనా ఇస్తారేమోనని ప్రజలు ఆశపడ్డారు. కానీ, కనీసం కందిపప్పు కూడా ఇవ్వకపోవడంతో దసరాకు కూడా పప్పన్నం తినలేని పరిస్థితి ఏర్పడిందని లబ్ధిదారులు నిట్టూరుస్తున్నారు. రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం తెల్లరేషన్‌కార్డుదారులకు అందించే కందిపప్పు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నిలిచిపోయింది. ఏ నెలకు ఆ నెల వినియోగదారులు ఎదురుచూస్తున్నప్పటికీ రేషన్ షాపులకు కందిపప్పు మాత్రం సరఫరా కావడం లేదు. జిల్లాలో మొత్తం 6,61,141 రేషన్ కార్డులు ఉండగా, 1,392 రేషన్ దుకాణాల ద్వారా సరుకులు అందిస్తున్నారు. ప్రభుత్వం కిలో 67 రూపాయలకు కార్డుదారులకు కందిపప్పు ఇవ్వాల్సి ఉంది. అయితే, 7 నెలలుగా కందిపప్పు ఇవ్వడం నిలిపివేశారు. బయట మార్కెట్లో కిలో 120 రూపాయలు పెట్టి కొనుగోలు చేయాల్సి వస్తుండటంతో అంత పెట్టి కొనలేక పేదలు లబోదిబోమంటున్నారు.
కందిపప్పు కేటాయింపు చేయాల్సింది ఇలా...
పౌరసరఫరాలశాఖ మార్కాపురం గోడౌన్ పరిధిలో మార్కాపురం, తర్లుపాడు, త్రిపురాంతకం, పెద్దారవీడు, పెద్దదోర్నాల మండలాలు ఉన్నాయి. ప్రతి నెలా ఆయా మండలాల్లోని రేషన్‌షాపులతో పాటు దొనకొండలో 8 షాపులకు, కొనకనమిట్లలో 6 షాపులకుగానూ మొత్తం 150 రేషన్ దుకాణాలకు 78 టన్నుల కందిపప్పు రావాల్సి ఉంది. ఈ నెలలో దసరా నవరాత్రి ఉత్సవాలు, మిలాద్ నబీ పండుగలున్న నేపథ్యంలో కార్డుదారులందరూ బయట మార్కెట్లో కిలో 120 రూపాయలు పెట్టి కందిపప్పు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతి ఒక్కరూ పప్పన్నం తినాలనే ఆశతో తమకు కందిపప్పు కావాలని డీలర్లను అడుగుతున్నారు. వారు మాత్రం ప్రభుత్వం నుంచి సరఫరా లేదంటూ సమాధానమిస్తున్నారు. పేదల పట్ల కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రజలు ఎండగడుగున్నారు.
ఈ నెల కూడా రేషన్‌లో కందిపప్పు సరఫరా చేయని ప్రభుత్వం
ఏడు నెలలుగా కందిపప్పు సరఫరా నిల్
బయట మార్కెట్లో కిలో కందిపప్పు రూ.120
జిల్లాలో 6,61,141 రేషన్ కార్డులు, 1,392 రేషన్ దుకాణాలు