
ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు
గిద్దలూరు రూరల్: పక్షవాతంతో మంచంపట్టిన ఓ మహిళ ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తోంది. ఆపదలో ఉన్న తనను మనసున్న మహారాజులు ఆర్థికంగా ఆదుకోవాలని వేడుకుంటోంది. విధి వక్రీకరించి అనారోగ్య సమస్యల కారణంగా మంచానికే పరిమితమై తీవ్ర ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతోంది. గిద్దలూరు పట్టణంలోని పాములపల్లె రోడ్డులో సత్యనారాయణ థియేటర్ సమీపంలో నివాసం ఉంటున్న షేక్ బేగ్‌మున్నిషా గత మూడు సంవత్సరాలుగా పక్షవాతంతో కుడి చేయి, కుడి కాలు పడిపోయి అనేక ఇబ్బందులు పడుతోంది. ఒక వైపు శరీరం సహకరించక అనారోగ్యానికి గురై మంచానపడగా.. మరో వైపు ఆర్థిక స్థోమత లేకపోవడంతో కడుపు నిండా తిండి తినే పరిస్థితి కూడా లేకుండాపోయిందని వాపోతోంది. సరైన వైద్యం అందక పక్షవాతం నుంచి కోలుకోలేని పరిస్థితి ఏర్పడటంతో విలపిస్తోంది.
12 సంవత్సరాల క్రితం భర్త దూరం...
కూలి పనులు చేసుకుని జీవనం కొనసాగించే బేగ్‌మున్నిషాకు 12 సంవత్సరాల క్రితమే భర్త దూరమయ్యాడు. ఒక కుమార్తె ఉండగా, కూలీనాలీ చేసుకుని జీవించే వ్యక్తికిచ్చి వివాహం చేసింది. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న బేగ్‌మున్నిషాకు పక్షవాతం వ్యాధి పెద్ద శాపంగా మారింది. దిక్కుతోచని పరిస్థితిలో ఒంటరిగా మంచానికే పరిమితమైంది. పక్షవాతంతో మంచం పట్టిన మున్నిషాను చూసి చుట్టుపక్కల వారు, సమీప బంధువులు కొందరు ఆహారం అందిస్తూ వస్తున్నారు. ఇటీవల ఆమైపె దయతలచి వైద్యుల వద్దకు తీసుకెళ్లి చూపించడంతో ఆమె హార్ట్‌బీట్ 30 శాతం మాత్రమే ఉందని చెప్పారు. ఆమె చికిత్సకు నెలకు రూ.10 వేల వరకూ ఖర్చవుతుందని తెలిపారు. అంత నగదు ఆమె వద్ద లేకపోవడంతో వైద్యం చేయించుకోలేక మంచంలోనే ఉండిపోయింది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా చితికిపోయిన తనకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందడం లేదని ఆమె వాపోతోంది. దాతలు ఎవరైనా సహృదయంతో ముందుకొచ్చి తనకు ఆర్థికసాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేస్తోంది.
పక్షవాతంతో మంచంపట్టిన మహిళ దీనస్థితి

ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు