
సారూ..సదా వారి సేవలో..!
సాక్షి టాస్క్‌ఫోర్స్: గణేష్ నిమజ్జన వేడుకలకు అనుమతి ఇవ్వడంతో పోలీసుల ‘పచ్చ’పాత వ్యవహార శైలిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే..అర్ధవీడు మండలంలోని మాగుటూరు గ్రామంలో వినాయక విగ్రహాల ఏర్పాటుకు అనుమతి కోసం గ్రామస్తులు ఎస్సై సుదర్శన్‌యాదవ్‌కు దరఖాస్తు పెట్టుకున్నారు. ఎస్సై మాత్రం అనుమతులు ఇవ్వకుండా నిమజ్జనాన్ని ఎటువంటి హంగు, ఆర్భాటాలు, డీజేలు లేకుండా గ్రామంలోకి రాకుండా బయట నుంచే వెళ్లి నిమజ్జనం చేసుకోండని చెప్పాడు. ఇదే సమయంలో అధికార పార్టీ నేతలు ఏర్పాటు చేసిన విగ్రహాలు ఎటువంటి అనుమతులు లేకుండా డీజేలు, బాణసంచా కాలుస్తూ, పాటలతో వెళ్లారు. పోలీసులు మాత్రం వారిని పట్టించుకోవడం లేదు. దీంతో వైఎస్సార్ సీపీ సానుభూతిపరులు ఆదివారం నిమజ్జనం సందర్భంగా ఎస్సై తీరును నిరసిస్తూ ఆగ్రహంతో మహిళలు, యువకులు, స్థానికులు భోజనం ప్లేట్లు, డబ్బాలు, నీళ్ల డ్రమ్ములతో డప్పులు కొడుతూ నల్లరిబ్బన్లు తలకు కట్టుకొని నిరసన తెలియజేశారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు లేవని, ఎస్సై అధికార పార్టీ మెప్పు పొందేందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వివాదంగా ఎస్సై తీరు..
అర్థవీడు ఎస్సైగా సుదర్శన్ యాదవ్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆయన తీరు వివాదాస్పదంగా ఉంది. అధికార పార్టీ నాయకులు చెప్పిన ఆదేశాలను పాటిస్తూ వైఎస్సార్ సీపీ నాయకులను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని పలువురు వాపోతున్నారు. మండలంలోని బసిరెడ్డిపల్లిలో వినాయకచవితి పండుగ సందర్భంగా వైఎస్సార్ సీపి అభిమానులు జగన్ పాటలు పెట్టారని అధికార పార్టీ నాయకులు చెప్పారని ఐదారు మందిని రెండు రోజులు స్టేషన్‌కు పిలిపించారని వారిపై ఎస్టీ కేసు పెట్టేందుకు చూస్తున్నట్లు సమాచారం. ఏదైనా గొడవలు జరిగి స్టేషన్‌కు వెళ్లాలన్నా వైఎస్సార్‌సీపి శ్రేణులు భయపడేలా ఎస్సై తీరు ఉందని, అన్యాయం జరిగిన వారికి కాకుండా అధికార పార్టీ నాయకులు చెప్పిన వారికే ఎస్సై న్యాయం చేస్తున్నారని పలువురు వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి అందరికీ న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నారు.

సారూ..సదా వారి సేవలో..!