
పవన్‌కళ్యాణ్‌వి అవకాశవాద రాజకీయాలు
● వైపాలెం ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్
యర్రగొండపాలెం: డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అవకాశవాద రాజకీయాలకు తెరతీసినట్లు సుగాలీ ప్రీతి కేసులో తేటతెల్లమైందని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మంగళవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికారాన్ని చేజిక్కించుకోవటానికి పవన్ కల్యాణ్ సుగాలీ ప్రీతి కేసును వారధిగా వాడుకున్నాడని అన్నారు. గిరిజన బిడ్డకు జరిగిన అన్యాయాన్ని డబ్బుతో వెలకట్టినట్లు మాట్లాడిన తీరు ఆయన అగ్రకుల అహంకారాన్ని బయటపెట్టిందన్నారు. తన కుటుంబాన్ని దూషించారని కేసులు కట్టి జైళ్లలో పెట్టించిన ఈ పెద్దమనిషి అతి క్రూరంగా అభం శుభం తెలియని బిడ్డను అత్యాచారం, హత్య చేసిన సంఘటనపై అప్పటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఒక్క మాట మాట్లాడలేదన్నారు. 2024 ఎన్నికల్లో లబ్ధి పొందటానికి ఈ వ్యవహారాన్ని ఎంచుకున్నాడని అన్నారు. సుగాలి ప్రీతి కుటుంబానికి అండగా నిలిచి పొలం, స్థలం, ఉద్యోగాన్ని బాధ్యతగా ఇచ్చిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వాన్ని, అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని నిందించడమే లక్ష్యంగా చేసుకున్నాడని అన్నారు. ఈ కేసులో ఎటువంటి రాజకీయ ఒత్తిడిలకు లోను కాకుండా విచారణ జరిపించాలన్న ఉద్దేశంతో జగన్‌మోహన్‌రెడ్డి సీబీఐకి అప్పగించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ కేసుతో రాజకీయ లబ్ధిపొందిన పెద్దమనిషి పవన్ కల్యాణ్ అధికారంలోకి వచ్చిన తరువాత దివ్యాంగురాలైన ప్రీతి తల్లి గర్భ శోకాన్ని అవహేళన చేయడం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన సహాయాన్ని కూడా తన ఖాతాలో వేసుకొని మాట్లాడటం హేయమైన చర్య అని అన్నారు. సీబీఐకి వనరులు ఇవ్వకుండా ఆ కేసులో అరెస్ట్ అయిన వారితో డీఎన్‌ఏ మ్యాచ్ కాలేదని లాజిక్‌లేని అసంబద్ధమైన వ్యాఖ్యలతో తప్పించుకునే ప్రయత్నం చేయడం డీసీఎంతోపాటు సీఎం చంద్రబాబు అసమర్ధతకు అద్దం పడుతోందని అన్నారు. డీఎన్‌ఏ ఇప్పుడు ఉన్న నిందితులతో మ్యాచ్ కావడంలేదంటే ఈ కేసులో ఇంకెవరో నిందితుడు తప్పించుకున్నాడన్న నిజం తెలిసినా కూడా పవన్ కల్యాణ్ ప్రజల దృష్టిని మళ్లించటానికి జనసేన నేతలతో దివ్యాంగురాలైన ప్రీతి తల్లి అవమానపరిచేలా మాట్లాడించారని అన్నారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ ఎస్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు పి.రాములు నాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆర్.అరుణాబాయి, పుల్లలచెరువు జెడ్పీటీసీ వాగ్యా నాయక్, నాయకులు కె.సురేష్ నాయక్, పి.మంత్రూనాయక్ పాల్గొన్నారు.