
రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి
మార్కాపురం: ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి వ్యక్తిమృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి ప్రకాశం జిల్లా మార్కాపురం–గజ్జలకొండ రైల్వే స్టేషన్‌ల మధ్య జరిగింది. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం బ్రాహ్మణకోడూరుకు చెందిన కమలకంటి హరిబాబు(39) బెంగళూరు వెళ్లేందుకు సోమవారం సాయంత్రం గుంటూరులో కొండవీడు ఎక్సెప్రెస్ రైలు ఎక్కాడు. రాత్రి సమయంలో భోజనం చేసి చేతులు కడుక్కునేందుకు ట్రైన్‌లోని డోరు వద్దకు వచ్చి ప్రమాదవశాత్తు జారి కిందపడ్డాడు. ఆ సమయంలో రైలు గజ్జలకొండ–మార్కాపురం రోడ్ మధ్య ఉంది. రైలులో ఉన్న ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై చైన్ లాగటంతో రైలు ఆగింది. వెంటనే లోకోపైలెట్‌లు, గార్డు అప్రమత్తమై సమాచారం తెలుసుకుని ఉన్నతాధికారులకు తెలిపి క్షతగాత్రుడి కోసం 2 కిలో మీటర్లు వెనక్కి వచ్చి ట్రైన్‌లో ఎక్కించుకుని మార్కాపురం రైల్వే స్టేషన్‌లో చికిత్స కోసం దించారు. అంబులెన్స్‌లో స్థానిక జీజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. కాగా ఆ సమయంలో రైల్వే అధికారులు ఎటువంటి సంఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తమై ఆ ట్రాక్‌లో మరో రైలు, గూడ్స్ రాకుండా చర్యలు తీసుకున్నారు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ హరికృష్ణారెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గాయపడిన వ్యక్తి చికిత్స కోసం 2 కిలో మీటర్లు వెనక్కి వచ్చిన రైలు