
బడుగు వర్గాల ఆరాధ్య దైవం వైఎస్సార్
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి
ఒంగోలు టౌన్: విద్య, వైద్యరంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి సంక్షేమ పథకాలను బడుగు, బలహీన వర్గాల ముంగిళ్లకు తెచ్చిన ఆరాధ్య దైవం వైఎస్ రాజశేఖర రెడ్డిని ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పటికీ మరచిపోరని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతిని పురస్కరించుకొని జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పార్టీ నాయకులతో కలిసి వైఎస్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైఎస్‌ఆర్ పాదయాత్రలో ప్రజల సమస్యలను తెలుసుకొని అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజారంజక పరిపాలన అందించారని కొనియాడారు. దేశంలో రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత వైఎస్సార్ ఒక్కరికే దక్కుతుందన్నారు. ఏ ఒక్క పేద విద్యార్థి చదువు ఆగిపోకూడదన్న లక్ష్యంతో ఫీజు రీయంబర్స్‌మెంట్ పథకాన్ని తీసుకొచ్చారని తెలిపారు. దాంతో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని లక్షలాది మంది నిరుపేద బిడ్డలు ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాలు సంపాదించుకున్నారని చెప్పారు. ఇప్పుడు రాష్ట్రంలో ఇంటింటికో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉన్నాడంటే అది రాజశేఖర రెడ్డి పుణ్యమేనన్నారు. కార్పొరేట్ విద్యను పేదల ముంగిళ్లకు తెచ్చిన రాజశేఖర రెడ్డిని విద్యాదాతగా ఎంతోమంది గుండెల్లో పెట్టుకొని పూజిస్తున్నారన్నారు. కులమతాలకతీతంగా సమాజంలోని అన్నీ వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి దైవంగా నిలిచాడన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించడానికి జగనన్న నాయకత్వంలో కలిసి మెలసి పనిచేస్తున్నామని తెలిపారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాలనతో రాజన్న పాలన తెస్తామన్నారు.
చంద్రబాబు పాలనలో అధోగతిలో రాష్ట్రం...
చంద్రబాబు ఏడాదిన్నర పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని మాజీ మంత్రి మేరుగు నాగార్జున విమర్శించారు. వ్యవసాయం దండగన్న పాలకుల రాజ్యంలో దుర్భర పరిస్థితి నెలకొందని, రైతులు గిట్టుబాటు ధరలు రాక అల్లాడి పోతున్నా పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. పొగాకు, పత్తి రైతుల గోడు వినేనాథుడే లేకుండా పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజన్న మరణించిన 16 ఏళ్లయినా నేటికీ ప్రజలు ఆయనను మరిచిపోలేదని, గుండెల్లో పెట్టుకొని పూజిస్తున్నారని చెప్పారు. అందుకు ఆయన చేసిన సేవలే కారణమన్నారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి ప్రాజెక్టులు నిర్మించారని, ఆయన ప్రారంభించిన ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్రంలో రైతులకు కరువు దిగులు ఉండదన్నారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తున్న జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవడం ద్వారానే రాజన్న రాజ్యం వస్తుందన్నారు.
జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి పేదల గుండెల్లో ఎప్పటికీ నిలబడి పోతారని చెప్పారు. ఒంగోలు పార్టీ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన ఒక స్వర్ణయుగంగా నడిచిందని, ప్రజలు సంతోషంతో జీవించారన్నారు. అలాంటి పాలన కోసం జగనన్నను సీఎం చేసుకుందామన్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు మాట్లాడుతూ ప్రజలకు ఉచితంగా విద్య, వైద్యాన్ని అందించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డికి మాత్రమే దక్కుతుందన్నారు. రాజన్న సంక్షేమ రాజ్యం అనేది ప్రజల్లో ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు కఠారి శంకర్, రాష్ట్ర కార్యదర్శులు కేవీ రమణా రెడ్డి, వై.వెంకటేశ్వర్లు, బొట్లా రామారావు, ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర జనరల్ సెక్రటరీ రొండా అంజిరెడ్డి, కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, లీగల్‌సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొట్లా సుబ్బారావు పాల్గొన్నారు.