
సోషల్ మీడియాలో చైన్ స్నాచింగ్ చూసి
ఒంగోలు టౌన్: డెలివరీ బాయ్‌గా సంపాదనతో సంతృప్తి పడలేకపోయాడు. బట్టల షాపు పెట్టి బాగా డబ్బులు సంపాదించాలనుకున్నాడు. అందుకు చేతిలో డబ్బులు లేకపోవడంతో దొంగగా మారి చివరికి జైలు పాలయ్యాడు. బుధవారం ఒంగోలు సీసీఎస్ పోలీసు స్టేషన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో సీఐ జగదీష్ వెల్లడించిన వివరాల ప్రకారం...గుంటూరు పట్టణానికి చెందిన తాళ్లూరి రాజ్ కుమార్ రత్నపూరి కాలనీలో నివాసం ఉంటాడు. డెలివరీ బాయ్‌గా పనిచేసే రాజ్ కుమార్‌కు అంతంత మాత్రం సంపాదనతో సరిపోక ఇబ్బందులు పడసాగాడు. బట్టల షాపు పెట్టాలని ప్రయత్నించాడు కానీ చేతిలో డబ్బులు లేకపోవడంతో విరమించుకున్నాడు. ఎలాగైనా సరే డబ్బులు సంపాదించాలనుకున్న రాజ్ కుమార్ సోషల్ మీడియాలో చైన్ స్నాచింగ్ చేసే విధానాన్ని చూసి దొంగగా మారాడు. మొదటిసారి తెనాలిలో చైన్ స్నాచింగ్ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. అయినా సరే పట్టువదలకుండా బాపట్లలో చైన్ స్నాచింగ్ చేసి బంగారాన్ని దొంగిలించాడు. అప్పటి నుంచి వరసగా చైన్ స్నాచింగ్ చేయసాగాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో బాపట్ల పట్టణంలోని జండా చెట్టు వీధి ఫిష్ మార్కెట్ ఒక మహిళ మెడలో బంగారు గొలుసు దొంగిలించాడు. అదేనెల 24వ తేదీ చీరాలలోని మేడవారి వీధి బొమ్మలతోటలో మహిళ మెడలో బంగారు చైను లాక్కొని పారిపోయాడు. జూలై నెలలో ఒంగోలు నగరంలోని మంగమూరు రోడ్డు లేడీస్ హాస్టల్ వద్ద నిలబడి ఉన్న మహిళ మెడలో చైను దొంగిలించాడు. ఆగస్టు 8వ తేదీ పల్నాడు జిల్లా వినుకొండ మెయిన్ బజారులో కాకుమాను పూర్ణచంద్రరావు గోల్డ్ షాపు వద్ద నిలబడి ఉన్న మహిళ మెడలో బంగారు చైనుతో పాటుగా నల్లపూసల దండ దొంగిలించాడు. ఒంగోలు చోరీకి సంబంధించి తాలుకా పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఈ చోరీలను సీరియస్‌గా తీసుకున్న ఎస్పీ ఏఆర్ దామోదర్ సీసీఎస్ సీఐ జగదీష్, తాలుకా సీఐ టి.విజయ కృష్ణ, తాలుకా ఎస్సై ఫీరోజ్, సీసీఎస్ సిబ్బందితో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని దర్యాప్తు చేసిన ప్రత్యేక బృందం బుధవారం నగరంలోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీ వద్ద రాజ్ కుమార్‌ను అరెస్టు చేశారు. అతడి వద్ద ఉన్న రూ.20 లక్షల విలువైన బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. విలేకరుల సమావేశంలో ఎస్సై ఫిరోజ్ పాల్గొన్నారు.