
రాత్రి వేళల్లో అక్రమ రవాణా
రాత్రి వేళల్లో మాత్రమే ఈ అక్రమ మైనింగ్ వ్యాపారం జోరుగా సాగుతోంది. రాత్రి 8 నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు యథేచ్ఛగా టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా ఇసుక, మట్టిని తరలించుకుపోతున్నారు. సింగరాయకొండ మండలంలో దేవదాయ, అసైన్డ్ భూముల్లో సైతం దందాలకు పాల్పడుతున్నారు. గత మార్చి నెల చివరి వారంలో ప్రజాసంఘాలు, కుల సంఘాల ఫిర్యాదుతో మైనింగ్ అధికారులు దాడులు జరిపి సుమారు రూ.5 లక్షల వరకు జరిమానా విధించారని తెలిసింది. తరువాత కొద్దిరోజులకే అక్రమ రవాణా చేస్తున్న గ్రావెల్ టిప్పర్‌ను మైనింగ్ అధికారులు ఏప్రిల్ మొదటి వారంలో పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీనికి సంబంధించి జరిమానా రూ.లక్షల్లో విధించగా నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకుల సహకారంతో కేవలం వేలల్లో జరిమానా కట్టారన్న ప్రచారం జోరుగా సాగింది.
శానంపూడి పంచాయతీ పరిధిలో మన్నేరు నుంచి ప్రతి రోజు 30 నుంచి 40 ట్రాక్టర్ల వరకు ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. ఇక్కడి నుంచి సింగరాయకొండ, ఉలవపాడు మండలాలకు ఇసుకు రవాణా అవుతోంది. ట్రాక్టరు ఇసుక రూ.1,200 నుంచి రూ.1,500 వరకు అమ్మకాలు జరుగుతున్నాయని సమాచారం. పచ్చతమ్ముళ్లు మాత్రమే ఇసుక రవాణా చేయాలన్న ఆంక్షలు ఉన్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.
జరుగుమల్లి మండలంలో కే బిట్రగుంట, జరుగుమల్లి, చింతలపాలెం, సతుకుపాడు, కామేపల్లి గ్రామాల పరిధిలో పాలేరులో ఇసుక తవ్వకాలు ఇష్టారాజ్యంగా సాగుతున్నాయి. పచ్చ నేతల పర్యవేక్షణలోనే ఇసుక రీచ్‌లు నిర్వహిస్తుండగా రీచ్‌లలో ప్రాంతాలను బట్టి రూ.500 నుంచి రూ.1000 వరకు వసూలు చేస్తున్నారని ట్రాక్టరు యజమానులు ఆరోపిస్తున్నారు. సతుకుపాడు, కామేపల్లి ప్రాంతాల్లో అయితే ట్రాక్టర్ల ద్వారా కేవలం పచ్చతమ్ముళ్లు మాత్రమే ఇసుక రవాణా చేస్తున్నారని, ఎవరైనా ఇంటి అవసరాలకు ట్రాక్టరు తీసుకెళ్లి ఇసుక తెచ్చుకోవాలంటే పచ్చనేతలకు కప్పం కట్టాల్సిందే. లేకపోతే అధికారులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
జరుగుమల్లి వద్ద పాలేరు నదిలో ఇసుకను పొక్లయినర్‌తో తవ్వి ట్రాక్టర్‌కు లోడ్ చేస్తూ..