
బడుగుల పిల్లలకు నాణ్యమైన విద్య దూరం
● యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్క వెంకటేశ్వర్లు
ఒంగోలు సిటీ: కూటమి ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను దూరం చేస్తోందని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్క వెంకటేశ్వర్లు విమర్శించారు. ఆదివారం ఒంగోలులోని టీటీడీ కళ్యాణ మండపంలో ఏపీ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ప్రకాశం జిల్లా శాఖ యూటీఎఫ్ మధ్యంతర కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు షేక్ అబ్దుల్ హై అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు నక్క వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పాఠశాల రంగాన్ని ప్రయోగ కేంద్రంగా మార్చిందని, ప్రపంచ బ్యాంక్ షరతులకు లోబడి పాఠశాల వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చిందన్నారు. అందులో భాగంగా ఉపాధ్యాయులను బోధనేతర పనులకు ఎక్కువగా వినియోగిస్తూ, పేద పిల్లలకు నాణ్యమైన విద్యను దూరం చేస్తోందన్నారు. ఉపాధ్యాయులకు ఎక్కువగా సెల్ఫ్ అసెస్‌మెంట్ పేరుతో ఎక్కువ భారం ఉన్న మూల్యాంకన విధానం తీసుకొచ్చిందన్నారు. పాఠశాలలో విద్యాబోధన చేయకుండా... ప్లాంటేషన్, మెగా పీటీఎం, యోగా లీడర్షిప్ ట్రైనింగ్ రకరకాల పనులతో సక్రమంగా పాఠశాల బోధన జరగటం లేదన్నారు. ఉద్యోగులకు రావాల్సిన ఆర్థిక అంశాలు 12వ పీఆర్‌సీ కమిషన్ వేయటం, ఐఆర్ ప్రకటించడం, 11వ పీఆర్సీ బకాయిలు, డీఏ బకాయిలు, సీపీఎస్ బకాయిలు రకరకాల మొత్తం సుమారు రూ.30 వేల కోట్లు ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు రావాల్సి ఉందన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాల మీద ఒక రూట్ మ్యాప్ ప్రకటించాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకొస్తామని తెలియజేశారు. యూటీఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కొమ్మోజు శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.వీరాంజనేయులు, గౌరవాధ్యక్షుడు ఎస్.రవి, సహాధ్యక్షులు ఐ.వి.రామిరెడ్డి, జి.ఉమా మహేశ్వరి, కోశాధికారి ఎన్.చిన్నస్వామి, జిల్లా కార్యదర్శులు, రాష్ట్ర కౌన్సిలర్లు, మండల శాఖల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, కార్యకర్తలు పాల్గొన్నారు.