
అర్జీల ఆడిట్‌లో నిర్లక్ష్యం వద్దు
– కలెక్టర్ తమీమ్ అన్సారియా
ఒంగోలు సబర్బన్: గ్రీవెన్స్ అర్జీల ఆడిట్ విషయంలో నిర్లక్ష్యం వద్దని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. గ్రీవెన్స్ అర్జీలు పరిష్కారమవుతున్న తీరుతో పాటు పౌరసరఫరాలు, రెవెన్యూ సంబంధిత అంశాలపై బుధవారం తన క్యాంపు కార్యాలయంలో జేసీ ఆర్ గోపాలకృష్ణతో కలిసి ఆమె సమీక్షించారు. ఆడిట్‌లో పెండింగ్ లేకుండా చూడాలన్నారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీల విషయంలో పెండింగ్ ఉండకూడదన్నారు. ఐవీఆర్‌ఎస్ ద్వారా ప్రభుత్వం ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నందున అర్జీదారులతో మర్యాదపూర్వకంగా మాట్లాడాలన్నారు. వృద్ధులకు నేరుగా ఇంటి వద్దకే రేషన్ సరుకుల పంపిణీలో పురోగతిపై కలెక్టర్ ఆరా తీశారు. పేదలకు పంపిణీ చేసేందుకు ఇప్పటికే గుర్తించిన ప్లాట్‌లలో ఖాళీలు, సాంకేతిక ఇబ్బందులపైనా అధికారులతో ఆమె చర్చించారు. సమావేశంలో డీఆర్‌ఓ బి.చిన ఓబులేసు, డీఎస్‌ఓ పద్మశ్రీ, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ వరలక్ష్మి, కలెక్టరేట్ పరిపాలనాధికారి రవి, గ్రీవెన్స్ ఆడిట్ బృంద సభ్యులు పాల్గొన్నారు.
గుర్తు తెలియని
మృతదేహం లభ్యం
ఒంగోలు టౌన్: నగర శివారులోని జగనన్న లే ఔట్లో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. పోలీసుల కథనం ప్రకారం... నగర శివారులోని అగ్రహారంలో జగనన్న లే ఔట్లో నీటి గుంతలో బుధవారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. మూడు రోజుల క్రితమే మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే కొత్తపట్నం మండలం పోలీసు స్టేషన్లో మూడు రోజుల క్రితం ఒక మిస్సింగ్ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. పోలీసులు వారికి సమాచారం ఇచ్చారు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.