హత్య కేసు కొట్టివేత | - | Sakshi
Sakshi News home page

హత్య కేసు కొట్టివేత

Aug 7 2025 10:34 AM | Updated on Aug 7 2025 10:34 AM

హత్య

హత్య కేసు కొట్టివేత

మార్కాపురం టౌన్‌: హత్య కేసులో నేరం రుజువు కానందున కేసు కొట్టివేస్తూ ఆరో అదనపు జిల్లా జడ్జి ఎం.శుభవాణి తీర్పు ఇచ్చినట్లు నిందితుల తరఫున న్యాయవాదులు లక్ష్మీకుమార్‌రెడ్డి, భూపని కాశయ్య, పురుషోత్తమనాయక్‌ బుధవారం తెలిపారు. వివరాలు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఖమ్మం పట్టణానికి చెందిన సద్దుల గౌరి అలియాస్‌ గీత చీరల వ్యాపారం చేసుకుంటూ వివిధ ప్రాంతాల్లో తిరుగుతుండేది. ఈ క్రమంలో జిల్లాలోని తాళ్లూరు మండలం దారంవారిపాలెం గ్రామానికి చెందిన ఎడ్లపల్లి అచ్చయ్యతో ఏర్పడిన పరిచయంతో సన్నిహితంగా మెలిగేది. వీరి మధ్య బేధాభిప్రాయాలు రావడంతో తేతపూడి వజ్రయ్య, కోటయ్య, అచ్చయ్య కలిసి 2010 ఆగస్టు 21న తాళ్లూరు మండలం తురకపాలెం గ్రామ పొలాల్లో ఆమెను గొంతునులిమి చంపారని తాళ్లూరు పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. అయితే కేసులో సాక్షులను విచారించిన తర్వాత నిందితులపై నేరం రుజువు కానందున కేసును కొట్టివేస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చినట్లు న్యాయవాదులు తెలిపారు.

మద్యం తాగి వాహనాలు నడపొద్దు

ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌

ఒంగోలు టౌన్‌: మద్యం తాగి వాహనాలు నడపి భవిష్యత్తును దెబ్బ తీసుకోవద్దని ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ హెచ్చరించారు. బుధవారం జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్‌ స్టేషన్ల పరిధిలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహించి పలువురిపై కేసులు నమోదు చేశారు. రాచర్ల మండలంలో మద్యం తాగి వాహనం నడుపుతున్న వ్యక్తిని గిద్దలూరు కోర్టులో హాజరుపరచగా 50 రోజుల జైలు శిక్షతోపాటు రూ.10 వేల జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇక నుంచి జిల్లాలో రోజూ వాహనాలు తనిఖీ చేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని, రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వారి తలిదండ్రులే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఎస్పీ స్పష్టం చేశారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

దొనకొండ: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే..దర్శి మండలం కట్టుబడివారిపాలెం గ్రామానికి చెందిన గర్నెపూడి మోషే (25) టెంట్‌ హౌస్‌ సప్లయిర్స్‌లో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. దొనకొండలోని బేతేలుపురానికి చెందిన రమ్యతో ఏడాది క్రితం వివాహమైంది. దొనకొండలో ఉన్న భార్య దగ్గరకు వచ్చిన మోషేకు తమ్ముడుకు బాగా లేదనే సమాచారంతో మంగళవారం రాత్రి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. చిన్నగుడిపాడు గ్రామం సమీపంలోని మలుపు వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి రోడ్డుపై పడి పోయాడు. రాత్రి కావడంతో ఆలస్యంగా గుర్తించారు. మెరుగైన వైద్యం నిమిత్తం ఒంగోలుకు తరలించారు. చికిత్స పొందుతూ మోషే మృతి చెందాడు. ఈ మేరకు ఎస్సై టి.త్యాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

డిజిటల్‌ అసిస్టెంట్‌పై పంచాయతీ కార్యదర్శి వేధింపులు

అధికారుల ముందే పంచాయతీ కార్యదర్శిని నిలదీసిన మహిళ

తాళ్లూరు: తాళ్లూరు సచివాలయం–1 డిజిటల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మహిళపై అదే సచివాలయంలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శి ఐవీ రమణారెడ్డి వేధింపులకు గురిచేస్తున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వేధింపుల గురించి ఎవరికి చెప్పుకోవాలో తెలియక సదరు మహిళా డిజిటల్‌ అసిస్టెంట్‌ మదనపడుతోంది. ఈ క్రమంలో బుధవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సమావేశానికి హాజరైన సదరు మహిళా డిజిటల్‌ అసిస్టెంట్‌..కార్యక్రమానికి హాజరైన అధికారుల ముందు తన ఆవేదన వ్యక్తం చేసింది. పంచాయతీ కార్యదర్శి ఏ విధంగా వేధిస్తున్నారో వివరించి అధికారుల ముందే అతన్ని నిలదీసింది. దీంతో ఏం చేయాలో తెలియని పంచాయతీ కార్యదర్శి నీళ్లు నమిలాడు. పంచాయతీ కార్యదర్శి ఏ విధంగా వేధిస్తున్నాడో ఫోన్‌లో ఉన్న ఆధారాలను అధికారులకు చూపించింది. విషయం తెలుసుకున్న సదరు మహిళ కుటుంబసభ్యులు అక్కడకు చేరుకొని పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహంతో ఊగిపోయారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వారిని చెదరగొట్టారు. సమస్య ఉంటే పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాలని చెప్పారు.

హత్య కేసు కొట్టివేత 
1
1/1

హత్య కేసు కొట్టివేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement