
సాగర్ కాలువలో యువకుడు గల్లంతు
దొనకొండ: సాగర్ కాలువలో ఈతకు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తూ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ఈ సంఘటన బుధవారం దొనకొండ మండలంలోని చందవరం గ్రామ సమీపంలో సాగర్ కాలువ వద్ద చోటుచేసుకుంది. వివరాలు.. దొనకొండ మండలంలోని పోలేపల్లి ఎస్సీ కాలనీకి చెందిన బెజవాడ మనోజ్, ఎనిబెర నాని, దానియేల్ అనే ముగ్గురు యువకులు ఈత నేర్చుకునేందుకు కాలనీ నుంచి 3 కిమీ దూరంలో ఉన్న చందవరం సమీపంలోని సాగర్ కాలువ వద్దకు వెళ్లారు. ఇటీవల కాలువకు నీరు విడుదల చేయడంతో ఉధృతంగా ప్రవహిస్తోంది. గట్టుపై కూర్చున్న బెజవాడ మనోజ్(18) ఈత కొట్టాలనే తాపత్రయంతో కాలువలోకి దిగాడు. నీటి ప్రవాహ ఉధృతికి మనోజ్ కొట్టుకుపోతుండగా గట్టుపై ఉన్న స్నేహితులు పెద్ద పెట్టున కేకలు వేశారు. వారికి ఈత రాకపోవడంతో కాలువలోకి దిగేందుకు సాహసించలేదు. కనుచూపు మేరలోనే నీటి ప్రవాహంలో మిత్రుడు గల్లంతవడంతో కన్నీటి పర్యంతమయ్యారు. సమాచారం తెలుసుకున్న బంధువులు, గ్రామస్తులు, స్నేహితులు హుటాహుటిన సాగర్ కెనాల్ వద్దకు వెళ్లి గాలించినా మనోజ్ ఆచూకీ లభ్యం కాలేదు. చేతికందివచ్చిన కుమారుడు కాలువలో గల్లంతవడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

సాగర్ కాలువలో యువకుడు గల్లంతు