
బాబును నమ్మితే మోసం గ్యారంటీ
చీమకుర్తి రూరల్: మోసానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి మేరుగు నాగార్జున అన్నారు. మండలంలోని ఎర్రగుడిపాడు, మంచికలపాడు, బండ్లమూడి గ్రామాల్లో బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమానికి మండల పార్టీ అధ్యక్షుడు పమిడి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మేరుగు నాగార్జున మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అనే పథకాలతో ప్రజలను మభ్యపెట్టి ఎన్నికల్లో గెలుపొందిందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను నెరవేర్చకుండా ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందన్నారు. గత వైఎస్సార్ సీపీ హయాంలో పార్టీలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాయన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక హామీలను తుంగలో తొక్కి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. అనంతరం చంద్రబాబు మోసాలను తెలియజేసే క్యూర్ కోడ్ కలిగిన పత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ యద్దనపూడి శ్రీనివాసరావు ఉపాధ్యక్షుడు యనం శేషరెడ్డి శ్రీధర్ల శేషు, సీనియర్ నాయకులు ఓబుల్ రెడ్డి మాస్టారు, జి. ఓబుల్ రెడ్డి, గంగిరేకుల వెంకటరావు, నల్లూరి చంద్ర, మొగిలిచెట్టి వెంకటేశ్వర్లు, పొన్నపల్లి సుబ్బారావు, పెరికల నాగేశ్వరరావు, పొన్నపల్లి నాగేశ్వరరావు అత్యాల అంకయ్య మాగులూరి ఇమ్మానియేల్, జడ రాజు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
స.హ చట్టంపై అవగాహన అవసరం
ఒంగోలు సబర్బన్: సమాచార హక్కు చట్టంపై ప్రకృతి వ్యవసాయ రైతులు, సిబ్బంది అవగాహన పెంపొందించుకోవాలని ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ వి.సుభాషిణి పేర్కొన్నారు. స్థానిక వెలుగు కార్యాలయంలో మంగళవారం సమాచార హక్కు చట్టంపై జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స.హ చట్టం ఉద్దేశం, పౌరులు సమాచారం పొందే విధానం, అధికారుల విధులు, బాధ్యతలను వివరించారు. ఈ చట్టం ద్వారా ప్రజలు తమ హక్కులను ఎలా వినియోగించుకోవచ్చు, పాలక వ్యవస్థలో ఎలా జవాబుదారీతనం తీసుకురావచ్చో ఉదాహరణలతో విశదీకరించారు. ఈ సందర్భంగా పలువురి సందేహాలను నివృత్తి చేశారు.