
తేరాతేజీ
అనుబంధాల సుమగంధం
సహపంక్తి భోజనాలు
చేస్తున్న ప్రజలు(ఫైల్)
● తేరాతేజీ వేడుకలకు సిద్ధమవుతున్న చారిత్రాత్మక కంభం చెరువు
● పెళ్లినాటి దండలను నీటిలో వదిలి మొక్కులు తీర్చుకోనున్న నూతన వధూవరులు
● వరుస సెలవు దినాలు కావడంతో సందర్శకులు పోటెత్తే అవకాశం
కంభం: ఆధ్యాత్మికత, అనుబంధాలకు ప్రతీకగా భావించే తేరాతేజీ(గరిక తొక్కుడు) పండగకు చారిత్రాత్మక కంభం చెరువు కట్ట సిద్ధమైంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కేవలం కంభంలో మాత్రమే నిర్వహించుకునే ఈ పండగకు ముస్లింలు భారీ సంఖ్యలో తరలివస్తారు. శుక్రవారం పండగ సందర్భంగా కొత్త జంటలు, వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో చెరువు కట్ట కోలాహలంగా మారనుంది.
ఇదీ పండగ విశిష్టత
ఏటా ఆగస్టులో నెల పొడుపు కనిపించిన 13వ రోజు తేరాతేజీ పండగను ముస్లింలు నిర్వహించుకుంటారు. తేరాతేజీ నెలను చేదు నెలగా చెబుతుంటారు. కొత్తగా వివాహం చేసుకున్న జంటలు నెల పొడుపు కనిపించినప్పటి నుంచి ఒకరి ముఖం ఒకరు చూసుకోకుండా 13వ రోజు తేరాతేజీ నాడు కంభం చెరువు కట్టపై కలుసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అక్కడే వారి పెళ్లినాటి దండలను నీటిలో వదిలి మొక్కులు తీర్చుకుంటారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి సహపంక్తి భోజనాలు చేస్తారు. చెరువు కట్టపై ఉన్న దీనాషావళి దర్గా వద్ద ప్రత్యేక పూజలు చేస్తారు. చెరువు కట్టపై ఉన్న పచ్చికను తొక్కితే ఆరోగ్యానికి మంచిదని ముస్లింల నమ్మకం. అందుకే గరికతొక్కుడు పండగగా పిలుస్తారు. చెరువుకట్టకు ఉదయాన్నే చేరుకుని సాయంత్రం వరకు అక్కడే గడిపి తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో మార్గమధ్యంలో ఉన్న మామిడి చెట్ల ఆకులు తీసుకెళ్లి గుమ్మాలకు కట్టుకుంటుంటారు.
పోటెత్తనున్న భక్తులు
అధికారికంగా సెలవు దినం లేకపోయినా తేరాతేజీ పండగ కోసం ముస్లింలు ఎదురుచూస్తుంటారు. హైదరబాద్, గుంటూరు, కర్నూలు, బెంగళూరు తదితర దూరప్రాంతాల్లో స్థిరపడిన వారు పండగ రోజున కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామమైన కంభం చేరుకుంటారు. అలాగే కర్నూలు, గుంటూరు, నంద్యాల, గిద్దలూరు, దొనకొండ, వినుకొండ తదితర ప్రాంతాలకు చెందిన ముస్లింలు కూడా చెరువు కట్టకు భారీ సంఖ్యలో తరలివస్తారు. ఇతర కులాలకు చెందిన వారు సైతం పిల్లలతో కలిసి సరదాగా చెరువు కట్టపైకి వచ్చి వెళ్తారు. రైలు మార్గంలో వచ్చే వారు కంభం చెరువు సమీపంలోనే రైళ్లను ఆపేసి అక్కడే దిగుతుంటారు. ఈ దఫా శుక్రవారంతోపాటు శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో మూడు రోజులపాటు ప్రజలు చెరువు కట్టకు వచ్చే అవకాశం ఉంది. అధిక సంఖ్యలో వాహనాలు వచ్చే అవకాశం ఉండటంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

తేరాతేజీ

తేరాతేజీ