
అంతా నా ఇష్టం..!
ఈ ఫొటోలో గేటు బయట దీనంగా ఎదురుచూస్తున్న వ్యక్తి ఎవరో కాదు. ఆ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు. గత ఏడు సంవత్సరాలుగా పాఠశాల విద్యార్థులను రాష్ట్ర, జాతీయ స్థాయిలో తీర్చిదిద్దిన ఘనత ఆయనిది. కానీ అదే ఆయనకు చేటు తెచ్చిపెట్టింది. పాఠశాల ప్రిన్సిపాల్ సదరు వ్యాయామ ఉపాధ్యాయుడిపై కక్ష కట్టి పాఠశాలలోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. పీడీ రామారావును విధుల్లోకి తీసుకోవాలని విద్యా శాఖ ఉన్నతాధికారులు ఆదేశించినా ఆ ప్రిన్సిపాల్‌కు అవేం పట్టడం లేదు. నన్ను ఎవరేం చేయలేరన్న భావనలో ఆయన వ్యవహార శైలి ఉందని విద్యార్థుల తల్లిదండ్రులే ఆరోపిస్తున్నారు.
ముండ్లమూరు(దర్శి): ముండ్లమూరు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. పాఠశాలలో విద్యార్థుల భవిష్యత్‌కు బంగారు బాటలు వేయాల్సిన ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వివరాల్లోకి వెళితే..ముండ్లమూరు మోడల్ స్కూల్‌లో 2018 నుంచి వ్యాయామ ఉపాధ్యాయునిగా రామారావు పనిచేస్తున్నారు. పీడీ రామారావు అప్పటి నుంచి పాఠశాల విద్యార్థులను జాతీయ స్థాయి క్రీడాకారులుగా సైతం తీర్చిదిద్దారు. రామారావు శిక్షణ జాతీయస్థాయిలో ఒకరు, రాష్ట్రస్థాయిలో నలుగురు, జిల్లా స్థాయిలో ఎంతో మంది విద్యార్థులు పాఠశాలలో రామారావు వద్ద శిక్షణ తీసుకొని రాణించారు. మండల స్థాయి నుంచి జాతీయస్థాయి వరకు క్రీడల్లో విద్యార్థులకు మంచి గుర్తింపు వచ్చేలా తీర్చిదిద్దారు. అయితే రామారావుకు మంచి పేరు రావడం ప్రిన్సిపాల్ సహించలేకపోయారు. దీంతో గత ఏడాది విద్యార్థులను జిల్లా స్థాయి క్రీడలకు పోనివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులను క్రీడలకు ఎందుకు పంపరని ప్రిన్సిపాల్‌ను పీడీ ప్రశ్నించారు. అప్పటి నుంచి కక్ష పెట్టుకున్న ప్రిన్సిపాల్..పీడీ విధులకు భంగం కలిగిస్తూ వస్తున్నాడు. జిల్లా స్థాయి పోటీలకు పిల్లలను పంపకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి ప్రిన్సిపాల్‌ను అడిగారు. దీంతో అప్పటి నుంచి తోటి ఉద్యోగి అన్న గౌరవం లేకుండా అందరి ముందు దుర్భాషలాడుతున్నాడు.
విధుల్లోకి రానివ్వకుండా అడ్డగింత
ఈ క్రమంలో నెల రోజులుగా పీడీ పాఠశాలకు రాకుండా ప్రిన్సిపాల్ అడ్డుకుంటున్నాడు. గేటు బయట వాచ్‌మెన్‌లు పెట్టి పీడీ లోపలికి రానివ్వడం లేదు. దీంతో ఏడు ఏళ్లుగా ఏ పాఠశాలలో విద్యార్థులను రాష్ట్ర, జాతీయస్థాయిలో తీర్చిదిద్దారో..అదే పాఠశాలలోకి ప్రవేశం లేక దీనంగా పాఠశాల గేటు బయట ఎదురుచూస్తున్నారు. ఇటీవల పాఠశాలలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా వాచ్‌మెన్లు దాడి చేసి ఫోన్ పగులగొట్టారని పీడీ వాపోయారు. ప్రిన్సిపాల్ వ్యవహార శైలి పట్ల తల్లిదండ్రులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నన్ను ఎవరేం చేస్తారనే భావనలో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని, విద్యా శాఖ ఉన్నతాధికారులు అతనిపై చర్యలు తీసుకోకుంటే మా పిల్లలను స్కూల్‌కు పంపమని చెబుతున్నారు.
విధుల్లోకి తీసుకోమని చెప్పాం:
కిరణ్‌కుమార్, డీఈఓ
ఈ విషయమై డీఈఓ కిరణ్‌కుమార్‌ను ఫోన్‌లో వివరణ కోరగా..గతంలోనే పీడీ రామారావును విధుల్లోకి చేర్చుకోవాలని ప్రిన్సిపాల్‌ను ఆదేశించాం. కానీ చేర్చుకోలేదు. విద్యార్థుల క్రీడా భవిష్యత్ నాశనం అవుతుందని ప్రిన్సిపాల్ పూర్ణచంద్రరావుకు షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చాం. ఉన్నతాధికారులు సైతం తెలియజేశాం. ఉన్నతాధికారుల నివేదిక ఆధారంగా తదుపరి ముందుకు వెళతాం.
ప్రిన్సిపాల్ నిర్వాకం..
పీడీకి సంకటం
మోడల్ స్కూల్‌లో ప్రిన్సిపాల్ ఇష్టారాజ్యం
నెల రోజులుగా పీడీపై కక్ష సాధింపు
రెన్యువల్ ఆర్డర్ వచ్చినా విధుల్లోకి తీసుకోకుండా ఇబ్బందులు
క్రీడలకు దూరమవుతున్న విద్యార్థులు
ప్రిన్సిపాల్ వైఖరిపై సర్వత్రా విమర్శలు

అంతా నా ఇష్టం..!