
ఏ ఒక్కరూ బాధ్యతలు విస్మరించరాదు
● జిల్లా న్యాయ సేవాదికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్టి షేక్ ఇబ్రహీం షరీఫ్
ఒంగోలు సబర్బన్: కార్మికులు, వాహనదారులు ఏ ఒక్కరూ బాధ్యతలు విస్మరించరాదని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి షేక్ ఇబ్రహీం షరీఫ్ పేర్కొన్నారు. స్థానిక వెంగముక్కల రోడ్డులోని రవాణాశాఖ డీటీసీ కార్యాలయంలో బుధవారం వాహనాల యజమానులకు, డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హక్కుల గురించి పోరాటం చేస్తుంటారని, కానీ బాధ్యతల గురించి పట్టించుకోరని గుర్తు చేశారు. వాహనదారులు తప్పనిసరిగా నియమ నిబంధనలు పాటించాలన్నారు. ప్రతి వ్యక్తి వెనుక ఒక కుటుంబం ఉంటుందన్న విషయాన్ని విస్మరించకూడదన్నారు. అసంఘటిత రంగంలోని కార్మికుల కోసం న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ కె.రామచంద్రరావు మాట్లాడుతూ వాహన చోదకులు రహదారి భద్రతా నియమాలను పాటించాలన్నారు. ప్రమాదాల నివారణే లక్ష్యంగా రవాణా శాఖ అవగాహన కల్పిస్తుందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆర్.సుశీల, డిప్యూటీ లేబర్ కమిషనర్ భవాని, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నరిశింగరావు, బాలల హక్కుల పరిరక్షణ అధికారి దినేష్‌కుమార్, జేజే బోర్డు లీగల్ అడ్వైజర్ రత్నప్రసాద్, న్యాయ సేవ సహాయకులు వావిలాల సదాశివశాస్త్రి, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు ఏ కిరణ్ ప్రభాకర్, ఎల్.సురేంద్ర ప్రసాద్, ఏఎంవిఐ కే.జయ ప్రకాష్, యు.ధర్మేంద్ర, బి.భాను ప్రకాష్, డి.జశ్వంత్, పరిపాలనాధికారులు డి.సుధాకర్, ఎం.శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు.