సాగులో ఉన్న పంట ధ్వంసం | - | Sakshi
Sakshi News home page

సాగులో ఉన్న పంట ధ్వంసం

Aug 8 2025 7:13 AM | Updated on Aug 8 2025 7:13 AM

సాగుల

సాగులో ఉన్న పంట ధ్వంసం

మర్రిపూడి: మూడు దశాబ్దాలుగా సాగుచేసుకుంటున్న భూమిలో ఉన్న కంది పంటను ఆ భూమి తమకు చెందిందంటూ ఓ వ్యక్తి, అతని కుటుంబ సభ్యులు ట్రాక్టర్‌తో దున్నివేసిన సంఘటన మర్రిపూడి మండలం ఎస్టీరాజుపాలెం గ్రామశివారులో గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. ఎస్టీరాజుపాలెం గ్రామానికి చెందిన గిరిజన రైతు పొన్నర్సు నాగేశ్వరరావు 33 ఏళ్ల క్రితం పొదిలి మండలం రాజుపాలేనికి చెందిన చిలకా వెంకయ్య, తుళ్లూరి పెద్దన్న వద్ద ఎస్టీరాజుపాలెం గ్రామ శివారులో సర్వే నంబర్‌ 178–2లో 4.32 ఎకరాలు, సర్వే నంబర్‌ 56–2లో 4.09 ఎకరాల భూమి కొనుగోలు చేసి అనుభవిస్తున్నారు. అప్పటి నుంచి నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు సాగుచేసుకుంటున్నారు. అయితే, ఇటీవల ఆ భూమిని గతంలో అమ్మిన చిలకా వెంకయ్య కుటుంబానికి చెందిన వారసులు తమదంటూ వచ్చి సాగులో ఉన్న వారిపై గొడవకు దిగారు. ఈ నేపథ్యంలో బాధితులు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామిని ఆశ్రయించి తమ గోడు వెల్లబోసుకున్నారు. నేనున్నానని మంత్రి హామీ ఇవ్వడంతో సదరు భూమిలో కంది పంట సాగుచేశారు. ప్రస్తుతం కంది పంట మొలకెత్తింది. ఆ పంటను చిలకా వెంకయ్య కుటుంబ సభ్యులు, వారి బావ మరుదులు 3 ట్రాక్టర్లతో వచ్చి నిలువునా దున్నేశారు. అడ్డుకోబోయిన బాధితుడు, అతని కుటుంబ సభ్యులతో వాదనకు దిగారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బాధితులు అడ్డం తిరిగితే అంతమొందించేందుకు సైతం మారణాయుధాలను పొలం వద్దకు ట్రాక్టర్‌లో తీసుకొచ్చినట్లు బాధితురాలు పొన్నర్సు శ్రీదేవి తెలిపారు. దీనిపై బాధితులు స్థానిక పోలీసులను ఆశ్రయించారు.

సాగర్‌ కెనాల్లో గల్లంతైన యువకుడు మృతి

దొనకొండ: మండలంలోని పోలేపల్లి ఎస్సీ కాలనీకి చెందిన బెజవాడ మనోజ్‌(18) బుధవారం చందవరం సమీపంలోని సాగర్‌ కాలువలో ఈతకు వెళ్లి నీటి ప్రవాహంలో గల్లంతైన విషయం తెలిసిందే. గురువారం ఎస్సై టి.త్యాగరాజు పర్యవేక్షణలో పోలీస్‌, అగ్నిమాపక సిబ్బంది మనోజ్‌ మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. డ్రోన్‌ ఆపరేటర్‌ నాయక్‌ సహాయంతో మృతదేహాన్ని గుర్తించి, పోస్ట్‌మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. తండ్రి తిరుపాలు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ఆర్మీ జవాన్‌ ఇంట్లో చోరీ

కంభం: తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు పడి నగలు, నగదు అపహరించిన సంఘటన స్థానిక వెంకటేశ్వరనగర్‌లో బుధవారం రాత్రి చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.. స్థానిక న్యూ ఆల్ఫా స్కూల్‌ సమీపంలో నివాసం ఉంటున్న ఆర్మీ జవాన్‌ మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల దర్శనానికి వెళ్లారు. గురువారం తెల్లవారుజామున ఇంటి బయట గేటు తాళం పగలగొట్టి ఉండటాన్ని పక్కింటి వారు గమనించారు. లోపలికి వెళ్లి చూడగా బీరువా పగలగొట్టి అందులోని వస్తువులు చిందరవందరగా పడేసి ఉన్నాయి. దీంతో స్థానికులు ఇంటి యజమానికి, పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని ఎస్సై నరసింహారావు పరిశీలించారు. మార్కాపురం క్లూజ్‌ టీమ్‌ బృందం వేలిముద్రలు సేకరించింది. ఇంట్లో 2 తులాల బంగారు నగలు, 20 తులాల వెండి పట్టీలు, రూ.50 వేల నగదు అపహరణకు గురైనట్లు సమాచారం. ఇటీవల కాలంలో పట్టణంలో దొంగతనాలు పెరిగిపోతుండటంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు.

పండగ పూట మృత్యు‘కీర్తన’

త్రిపురాంతకం: కళాశాలకు వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో తండ్రితో కలిసి బైక్‌పై సంతోషంగా ఇంటికి వెళ్తున్న బాలికను మార్గమధ్యంతో మృత్యువు బలితీసుకుంది. ఈ సంఘటన త్రిపురాంతకం మండలంలోని కంకణాలపల్లి రోడ్డులో గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. కురిచేడు పడమర మాలపల్లెకు చెందిన బుట్టి కీర్తన(17) త్రిపురాంతకంలోని కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియెట్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. వరలక్ష్మి వ్రతం, రెండో శనివారం, ఆదివారం.. ఇలా వరుసగా 3 రోజులు కళాశాలకు సెలవు రావడంతో తండ్రితో కలిసి బైక్‌పై ఇంటికి బయలుదేరింది. ఈ క్రమంలో కంకణాలపల్లి వద్ద బైక్‌ అదుపు తప్పడంతో సీసీ రోడ్డుకు కీర్తన తల బలంగా కొట్టుకుంది. తీవ్రంగా గాయపడిన ఆమెకు స్థానిక వైద్యశాలలో ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం పల్నాడు జిల్లా వినుకొండ తరలించగా అక్కడ మృతి చెందింది. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

పిడుగుపాటుకు ఒకరు మృతి

మృతుడు వీరరాంపురం గ్రామ వైస్‌ సర్పంచ్‌

హనుమంతునిపాడు: మండల పరిధిలోని వీరరాంపురం గ్రామ పంచాయతీ వైస్‌ సర్పంచ్‌ గోనా దానయ్య(48) గురువారం సాయంత్రం పిడుగుపాటుకు మృతి చెందారు. వివరాలు.. దానయ్య వ్యక్తిగత పని నిమిత్తం బైక్‌పై నందనవనం వెళ్లి సాయంత్రం స్వగ్రామానికి తిరుగుప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం మొదలవడంతో రోడ్డు పక్కనే ఉన్న నందనవనం ఎంపీటీసీ నారాయణస్వామి పొలంలో రేకుల షెడ్‌ వైపు అడుగులు వేశారు. అదే సమయంలో పిడుగు పడటంతో దానయ్య అక్కడికక్కడే మృతి చెందారు. రేకుల షెడ్‌ కింద ఉన్న మరో ఇద్దరు షాక్‌కు గురై కాసేపటికి తేరుకున్నారు. మృతుడు దానయ్య భార్య సనీత అంగన్‌వాడీ కార్యాకర్తగా పనిచేస్తూ అనారోగ్యంతో రెండేళ్ల క్రితం మృతి చెందింది. మృతుడికి ఇద్దరు పిల్లలున్నారు. అందరితో కలివిడిగా ఉండే దానయ్య మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఆవును ఢీకొట్టిన ఆటో

వృద్ధురాలు మృతి.. మరో ముగ్గురికి గాయాలు

కంభం: ప్రయాణికులతో వెళ్తున్న ఆటో రోడ్డుపై అడ్డుగా వచ్చిన ఆవును ఽఢీకొట్టిన ప్రమాదంలో ఓ వృద్ధురాలు మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన గురువారం రాత్రి అనంతపురం–అమరావతి హైవే రోడ్డుపై కంభం సమీపంలో చోటుచేసుకుంది. వివరాలు.. కందులాపురం సెంటర్‌ నుంచి జంగంగుంట్లకు వెళ్తున్న ఆటో గ్రామ సమీపంలోని పెట్రోల్‌ బంకు వద్ద అడ్డుగా వచ్చిన ఆవును ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో దూదేకుల సిద్ధమ్మ(65) మృతి చెందగా వెంగమ్మ, ఖాసింబి, ఆటో డ్రైవర్‌ ఓబుల్‌ రెడ్డికి మోస్తరు గాయాలయ్యాయి. మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. మృతదేహాన్ని, క్షతగాత్రులకు కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

33 ఏళ్లుగా అనుభవంలో ఉన్న గిరిజన రైతు

మొలకెత్తిన పంటను అక్రమంగా దున్నిన అమ్మకందారుని కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించిన గిరిజనులు

సాగులో ఉన్న పంట ధ్వంసం 1
1/5

సాగులో ఉన్న పంట ధ్వంసం

సాగులో ఉన్న పంట ధ్వంసం 2
2/5

సాగులో ఉన్న పంట ధ్వంసం

సాగులో ఉన్న పంట ధ్వంసం 3
3/5

సాగులో ఉన్న పంట ధ్వంసం

సాగులో ఉన్న పంట ధ్వంసం 4
4/5

సాగులో ఉన్న పంట ధ్వంసం

సాగులో ఉన్న పంట ధ్వంసం 5
5/5

సాగులో ఉన్న పంట ధ్వంసం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement