
హామీలకు తూట్లు !
బకాయిలు కోట్లు..
నల్ల బర్లీ పొగాకు చివరి ఆకు వరకూ కొంటాం.. ఇది వ్యవసాయ శాఖామంత్రి అచ్చెంనాయుడు చెప్పిన మాట.. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. జిల్లాలో 6,325 టన్నుల నల్ల బర్లీ పొగాకు ఉత్పత్తి కాగా, ఇప్పటి వరకుకొనుగోలు చేసింది కేవలం 860 టన్నులు మాత్రమే. అంటే, ఉత్పత్తిలో కేవలం 15 శాతం మాత్రమే కొనుగోలు చేశారు. ఇందుకు రైతులకు చెల్లించాల్సిన రూ.7 కోట్ల బకాయిలు కూడా ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. అసలే మద్దతు ధర రాక అల్లాడుతున్న రైతులు కూటమి ప్రభుత్వ చర్యలతో మరింత ఆర్థిక కష్టాల్లో కూరుకుపోతున్నారు.
ఒంగోలు సబర్బన్:
మిర్చి రైతును దగా చేసినట్టుగానే ప్రభుత్వం పొగాకు రైతునూ నయవంచన చేస్తోంది. బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటున్నా మని కూటమి ప్రభుత్వ పెద్దలు.. కొనుగోళ్లు ప్రారంభించి దాదాపు 48 రోజుల కావస్తోంది. అయినా ఇంత వరకు ఒక్క రూపాయి కూడా రైతుకు చెల్లించలేదు. రైతులు పెట్టిన పెట్టుబడి, బయట తెచ్చిన అప్పులతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారన్న ఆలోచన కూడా చేయడం లేదు చంద్రబాబు ప్రభుత్వం.
రైతుల వద్దే
5,465 టన్నులు...
జిల్లాలో బ్లాక్ బర్లీ పొగాకు దాదాపు 6,325 టన్నులు ఉత్పత్తి అయినట్లు అధికారులు అంచనాలు రూపొందించారు. జిల్లాలోని దాదాపు 20 మండలాల్లో బ్లాక్ బర్లీ పొగాకు సాగు చేశారు. ప్రధానంగా నాగులుప్పలపాడు, రాచర్ల, మద్దిపాడు, ముండ్లమూరు, దొనకొండ, కురిచేడు, పామూరు, కొమరోలు, తాళ్లూరు మండలాల్లో అత్యధికంగా సాగు చేయగా, మరో 11 మండలాల్లో ఒక మోస్తరుగా సాగు చేశారు. మద్దిపాడు మండలం గార్లపాడు గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలోని రైతులందరూ బ్లాక్ బర్లీ పొగాకును అక్కడకు తీసుకురావాలని సూచించారు. ఇంత పెద్ద మొత్తంలో ఉత్పత్తి అయితే.. తొలుత 500 టన్నులు కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఆ తర్వాత 800 టన్నులు అన్నారు. ప్రస్తుతానికి 1000 టన్నులు కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటి వరకు 400 మంది రైతుల నుంచి 860 టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. అయినా ఏ ఒక్క రైతుకూ ఒక్క రూపాయి కూడా జమ చేయలేదు. ఇప్పటి వరకు జిల్లాలోని రైతాంగానికి దాదాపు రూ.7 కోట్ల వరకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది.
ఆంక్షలతో చుక్కలు చూపిస్తున్న ప్రభుత్వం...
రైతుల వద్ద ఉన్న చివరి ఆకు వరకు కొనుగోలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఆచరణకు వచ్చేసరికి ఒక్కో రైతు నుంచి గరిష్టంగా 20 క్వింటాళ్లకు మించి కొనుగోలు చేయబోమని ప్లేటు ఫిరాయించింది. దానికితోడు 20 శాతానికి మించి తేమ శాతం ఉండరాదని కూడా స్పష్టంగా ఆంక్షలు విధించింది. ఇలాంటి సందర్భాల్లో సన్న, చిన్నకారు రైతులకు ప్రాధాన్యత ఇస్తారు. గరిష్టంగా ఐదు, 10 ఎకరాల పరిధిలోని రైతుల వద్ద పంట నిల్వలు కొనుగోలు చేయాలి. ఐదెకరాల్లోపు చిన్న రైతు దగ్గర సైతం దాదాపు 60 టన్నులకు తక్కువ కాకుండా పొగాకు నిల్వలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పెట్టిన నిబంధనల ప్రకారం 20 క్వింటాళ్లు కొనుగోలు చేస్తే మిగిలిన 40 క్వింటాళ్లను ఆ రైతు ఏం చేసుకోవాలి. కొనుగోలు చేస్తామని నమ్మించి మోసం చేసిన కంపెనీలు కొనుగోలు చేయకపోవడంతోనే ఈ సంక్షోభం ఏర్పడింది.
పొగాకు రైతును నమ్మించి మోసం చేస్తున్న ప్రభుత్వం బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలు చేస్తున్నామంటూ ఊరిస్తున్న వైనం జిల్లాలో 6,325 టన్నుల ఉత్పత్తి ఇప్పటివరకు కేవలం 860 టన్నులే కొనుగోలు ఒక్క రూపాయి కూడా రైతుకు చెల్లించని ప్రభుత్వం రైతులకు చెల్లించాల్సింది రూ.7 కోట్లు దిక్కుతోచని స్థితిలో జిల్లాలోని పొగాకు రైతులు
ఆశగా ఎదురుచూస్తున్న వర్జీనియా రైతులు...
వ్యాపారుల చేతిలో చిక్కిశల్యమవుతున్న వర్జీనియా పొగాకు రైతులు కూడా మార్క్‌ఫెడ్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయిస్తుందేమోనన్న ఆశతో ఎదురుచూస్తున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వ్యాపారులు ఇదేవిధంగా కొనుగోలు చేయకుండా ఇబ్బందులు పెడుతుంటే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించి రైతుల వద్ద ఉన్న పొగాకు మొత్తాన్ని కొనుగోలు చేయించారు. చివరకు లో గ్రేడుకు మంచి ధర రాగా ఎందుకూ పనికిరాని మాడు రకం పొగాకుకు కూడా అనుకోని విధంగా ధరలు పెరిగి రైతులు ఎంతో లాభపడ్డారు. కానీ, ప్రస్తుతం బ్లాక్ బర్లీ పొగాకులో ఉత్పత్తి అయిన దానిలో కనీసం 15 శాతం మాత్రమే కొనుగోలు చేసి రైతులను ఇబ్బంది పెడుతున్న చంద్రబాబు ప్రభుత్వం ఇక వర్జీనియా పొగాకు రైతులను ఆదుకునే అవకాశాలు కనుచూపు మేరలో కనపడటం లేదని రైతు సంఘ నాయకులు అంటున్నారు.

హామీలకు తూట్లు !