
చేనేత ఉత్పత్తులను ఆదరించాలి
ఒంగోలు సబర్బన్: చేనేత ఉత్పత్తులను ఆదరించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ అన్నారు. గురువారం జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని చేనేత కార్మికులతో కలిసి స్థానిక కలెక్టరేట్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జేసీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ స్వదేశీ ఉద్యమంలో చేనేత ఉత్పత్తులు కూడా కీలకపాత్ర పోషించాయన్నారు. కాలపరీక్షను ఎదుర్కొని నిలబడిన చేనేత రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. చారిత్రక విశిష్టత కలిగిన చేనేత రంగాన్ని ఆదుకునేలా ప్రభుత్వం విద్యుత్, జీఎస్టీ రాయితీతోపాటు చేనేతకారుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయం తీసుకుందన్నారు. చేనేత సొసైటీలకు ఆప్కో నుంచి రావాల్సిన బకాయిలు త్వరగా చెల్లించేలా చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సందర్భంగా చేనేత ఉత్పత్తులను సొసైటీలు విక్రయించుకునేలా అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. మరో స్వాతంత్య్ర ఉద్యమంలా చేనేత ఉత్పత్తులను ఆదరించాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఎల్‌డీఎం రమేష్ మాట్లాడుతూ చేనేతకారులకు ముద్ర రుణాలు త్వరగా మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. చేనేత, జౌళి సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రఘునందన్ మాట్లాడుతూ ముద్ర పథకం కింద బ్యాంకు రుణాల కోసం 2024 – 25 సంవత్సరంలో 217 దరఖాస్తులు వచ్చాయని, వీటిలో 27 దరఖాస్తుదారులకు రూ.26 లక్షల రుణం మంజూరు చేసినట్లు తెలిపారు. అనంతరం ఏడుగురు చేనేతకారులను జాయింట్ కలెక్టర్ సన్మానించారు. చేనేత వస్త్రాల ప్రదర్శనను తిలకించారు. కార్యక్రమంలో చేనేత, జౌళి శాఖ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ వి.భీమయ్య, డెవలప్మెంట్ ఆఫీసర్ ఏ వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ టి.వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ముందుగా ప్రకాశం భవనం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు నిర్వహించిన ర్యాలీని డీఆర్‌ఓ బి.చిన ఓబులేసు ప్రారంభించారు. చేనేత రంగ విశిష్టతను ఆయన కొనియాడారు.
జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం