
9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం
ఒంగోలు వన్‌టౌన్: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఈ నెల 9వ తేదీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖాధికారి, ఎస్టీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ అధికారి వరలక్ష్మి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒంగోలు మినీ స్టేడియం పక్కనున్న గిరిజన భవన్‌లో ఉదయం 10 గంటలకు కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
22న తపాలా జీవిత బీమా ఏజెంట్ల ఎంపిక
ఒంగోలు వన్‌టౌన్: భారత తపాలా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే తపాలా జీవిత బీమా, గ్రామీణ తపాలా జీవిత బీమా పాలసీలు కట్టించే ఏజెంట్లను ఎంపిక చేసేందుకు ఈ నెల 22వ తేదీ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టు ఆఫీసెస్ ప్రకాశం డివిజిన్ ఎండీ జాఫర్ సాధిక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న ఏజెంట్లకు వారు సేకరించిన పాలసీలపై ఆకర్షణీయమైన కమీషన్ చెల్లించనున్నట్లు చెప్పారు. అభ్యర్థులు కనీసం 10వ తరగతి పాసై 18 సంవత్సరాలు నిండి ఉండాలన్నారు. ప్రాంతీయంగా పరిచయాలు కలిగి ఇన్సూరెన్స్ గురించి తెలిసి ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు చెప్పారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు బయోడేటాతో పాటు టెన్త్, ఇంటర్ మార్కుల జాబితాలు, 2 పాస్‌పోర్టు సైజు ఫొటోలు, ఆధార్ కార్డు, పాన్ కార్డుతో 22వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రకాశం పోస్టల్ సీనియర్ సూపరింటెండెంట్ కార్యాలయం, ఆంజనేయ కాంప్లెక్స్, భాగ్యనగర్ 2వ లైన్, ఒంగోలులో ఇంటర్వ్యూకు హాజరుకావాలని సూచించారు. ఎంపికై న అభ్యర్థులు రూ.5 వేలకు ఎన్‌ఎస్‌సీ, కేవీపీ అకౌంట్ రూపంలో సెక్యూరిటీ డిపాజిట్ చేయాలని తెలిపారు.
క్రీడా స్ఫూర్తి చాటాలి
ఒంగోలు: ప్రతిఒక్కరూ క్రీడాస్ఫూర్తి చాటుతూ త్వరలో నిర్వహించనున్న సౌత్ జోన్ పోటీల్లో జిల్లా పతాకాన్ని రెపరెపలాడించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఓ చిన్నఓబులేసు పిలుపునిచ్చారు. మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని జిల్లా క్రీడాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో స్థానిక డాక్టర్ పీ ఆనంద్ మినీ స్టేడియంలో గురువారం నిర్వహించిన 10 రకాల ఆటల పోటీలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా జాతీయ పతాకంతో పాటు జిల్లా పతాకాన్ని, జిల్లా క్రీడాపతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ క్రీడాకారులు ప్రతిభ చాటేందుకు ఈ పోటీలు మంచి అవకాశమని అన్నారు. డీఈఓ కిరణ్‌కుమార్ మాట్లాడుతూ ఏ రంగంలో రాణించాలన్నా క్రమశిక్షణ ముఖ్యమన్నారు. ఇది క్రీడాకారుల్లో ఎక్కువగా ఉంటుందని, అందువల్ల చదువుతోపాటు క్రీడలలో కూడా రాణించాలని పిలుపునిచ్చారు. జిల్లా క్రీడాభివృద్ధి శాఖాధికారి జి.రాజరాజేశ్వరి మాట్లాడుతూ అథ్లెటిక్స్, ఆర్చరీ, బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, కబడ్డీ, ఖోఖో, హాకీ, వాలీబాల్ పోటీలు నిర్వహించి అండర్–22 విభాగానికి జిల్లా బాలబాలికల జట్లు ఎంపిక చేస్తున్నామన్నారు. ఎంపికై న జట్లు త్వరలో జరిగే సౌత్‌జోన్ పోటీల్లో తలపడతాయని తెలిపారు. అనంతరం పోటీలు నిర్వహించి జట్లను ఎంపిక చేశారు. కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కుర్రా భాస్కరరావు, క్రీడల ఇన్‌చార్జి వై.శీనయ్య, పలు క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలి
ఒంగోలు వన్‌టౌన్: జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీలకు చెందిన అర్హత ఉన్న విద్యార్థులు తమ పోస్టుమెట్రిక్ అనంతర ఉపకార వేతనాల రెన్యువల్స్‌కు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎన్.లక్ష్మానాయక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.